నాలుకే అతడి కుంచె..
బొమ్మ గీయాలంటే ఏం కావాలి? కుంచె, కాన్వాస్, రంగులు.. ఇదేగా మీ సమాధానం. కానీ కేరళకు చెందిన చిత్రకారుడు అని.కె మాత్రం.. కాన్వాస్, రంగులు ఉంటే చాలంటారు. ఎందుకంటే నాలుకే ఆయన కుంచె. దాంతోనే ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఏసుక్రీస్తు నిలువెత్తు చిత్రపటం సహా ఎన్నో పెయింటింగ్స్ ఆయన నాలుక నుంచి జాలువారాయి. కేరళలోని ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న అని.కె.. రంగులు కలపడానికి కూడా తన నాలుకనే వినియోగిస్తారు. ఒక్కో పెయింటింగ్ వేయడానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం తీసుకుంటారు. అందరు చిత్రకారుల్లా కాకుండా కొత్త పద్ధతిలో చిత్రాలు గీయడం ద్వారా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ మార్గం ఎంచుకున్నట్టు చెప్పారు. దీనివల్ల ఆయన కొన్ని ఇబ్బందులు కూడా పడుతున్నారు. నాలుకతోనే రంగులు కలిపి, దాంతోనే చిత్రాన్ని గీయడం వల్ల తలనొప్పి, దవడ నొప్పితోపాటు దృష్టి మందగించడం, జ్ఞాపకశక్తి క్షీణించడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఓ చిత్రం గీసిన తర్వాత దాదాపు రెండు వారాల వరకు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుకతోనే కాకుండా ముక్కు, గడ్డం, మోచేతులు, పాదాలతో కూడా చిత్రాలు గీయడం ఈయన ప్రత్యేకత. ఒకేసారి రెండు చేతులతో రెండు చిత్రాలు కూడా వేయగలరు.