మాజీ ప్రధాని పీవీ పీఏపై నటి సంగీత ఫిర్యాదు
తమిళసినిమా, న్యూస్‌లైన్ : కుక్కల గొడవ కోర్టు కెక్కింది. తనను అసభ్యంగా మాట్లాడారంటూ నటి సంగీత మాజీ ఐఏఎస్ పై ఫిర్యాదు చేశారు. వివరాల్లో కెళితే..స్థానిక వలసరవాక్కం, జానకి నగర్‌లోని ఆరవ వీధిలో ఉషా శంకర్ నారాయణ (68), నటరాజన్ ఇంట్లో, ఆరు నెలల క్రితం అద్దెకు చేరారు. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు వద్ద పీఏగా పని చేశారట. అవివాహితుడైన ఉషా శంకర్ నారాయణన్ తనకు తోడుగా పది శునకాలను పెంచుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇంటి యజమానికి ముందుగానే తెలియచేయడంతో ఆయన ఎలాంటి అభ్యంతరం తెలపలేదట.
ఉషాశంకర్ నారాయణన్ తన శునకాలను పగటివేళల్లో కూడా బయటకు వదలడంతో ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఈ విషయమై వారు పలుమార్లు ఉషా శంకర్ నారాయణన్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదు. దీంతో అదే వీధిలో నివసిస్తున్న నటి సంగీత కుక్కలను బయటకు వదలవద్దని ఉషా శంకర్ నారాయణన్‌కు చెప్పారు. అందుకాయన తాను మాజీ ఐఏఎస్ అధికారి అని, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు పీఏగా పని చేశానంటూ అసభ్యకరంగా మాట్లాడారు. దీంతో నటి సంగీత ఆ ప్రాంత ప్రజలు కొందరు వలసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి వ్యతిరేకంగా ఉషా శంకర్ నారాయణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వీరి ఫిర్యాదులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉషాశంకర్ నారాయణన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారించిన కోర్టు తగిన చర్యలు తీసుకోవాలని వలసరవాక్కం పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పోలీసులు నటి సంగీత, ఆ ప్రాంత ప్రజలు కొందరిపై కేసు నమోదు చేశారు.
కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం :
ఈ సంఘటనపై నటి సంగీత, ఆమె భర్త గాయకుడు క్రిష్ విలేకరులకు తెలుపుతూ ఉషా శంకర్ నారాయణన్ తాను మాజీ ఐఏఎస్ అధికారంటూ వీరంగం చేస్తున్నారని చెప్పారు. ఆయన పెంచుకుంటున్న కుక్కలు వీధిలో తిరగడం వల్లనే పిల్లలు ఆడుకోవడానికి భయపడుతున్నారన్నారు. మూడు నెలల క్రితం ఒక పిల్లాడిని ఉషా శంకర్ నారాయణన్ పెంచుతున్న కుక్క కరిచిందని తెలిపారు. దీంతో పగటి వేళల్లో కుక్కలను బయటకు వదలకూడదని చెప్పామన్నారు. అందుకాయన తనను దుర్భాషలాడారని తెలిపారు. ఈ విషయమై వలసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీంతో తాను న్యాయవాదులతో చర్చించి ఉషా శంకర్నారాయణన్పై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.