సీపీఎస్ రద్దు కోరుతూ కోటి సంతకాల సేకరణ
భీమవరం : సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో ఆదివారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టిఎఫ్ఐ) పిలుపు మేరకు చేపట్టిన ఈ సంతకాల సేకరణను యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపీమూర్తి తొలి సంతకం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్ రద్దు కోసం ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 29న చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భీమవరం డివిజన్ ఎన్జీవో సంఘ అధ్యక్షుడు కె.కామరాజు మాట్లాడుతూ సీపీఎస్ వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఈ ఉద్యమానికి అన్ని సంఘాలు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సీహెచ్ పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శి పి.సీతారామరాజు, ఎంఐ విజయ్‌కుమార్, పి.శ్రీనివాసరాజు, కె.సాయిరామ్, పీఎస్ విజయరామరాజు, జి.సుధాకర్, రవిచంద్రకుమార్, మల్లుల శ్రీనివాస్, ఆర్.శర్మ, రాజేష్ కుమార్, రవిచంద్రకుమార్ పాల్గొన్నారు.