నీ స్టయిలే... చరాస్!
‘మన గౌరవ అధ్యక్షుడు కిమ్ జొంగ్- ఉన్ మాదిరిగానే మగాళ్లందరూ తలకట్టు మార్చుకోవాలి’ అంటూ ఉత్తర కొరియా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందట. ఇదెంత వరకు నిజమో తెలియదుగానీ రాజుగారి హెయిర్ స్టయిల్ గురించి వేడి వేడి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.హెయిర్‌స్టయిల్ కోడ్ ఉల్లంఘించిన వారిని ప్రభుత్వం ఒక చూపు చూస్తుందని, పాటించిన వారిని కరుణించి తగిన ప్రోత్సాహకాలు అందిస్తుందని...ఇలా ఏవేవో వినిపిస్తున్నాయి.
కింగ్ జొంగ్ తిక్క చేష్టల గురించి బాగా తెలిసిన కొరియా ప్రజలు ప్రతి వదంతిని నిజమే అనుకుంటున్నారు.సెలూన్ ముందు క్యూ కట్టి అధ్యక్షుల వారి స్టయిల్లోనే ‘షార్ట్ బ్యాక్ అండ్ సైడ్ ప్లీజ్’ అంటున్నారు. ‘షార్ట్ బ్యాక్ అండ్ సైడ్స్’ అనే ఈ స్టయిల్ 1990 ప్రాంతంలో బ్రిటన్‌లో చాలా ప్రాచుర్యం పొందింది. బ్రిటిష్ రియాలిటీ టీవి షో మేల్స్టార్లు ఎక్కువగా ఈ తలకట్టుతో కనిపించేవారు. ‘‘ ఇదెక్కడి తల నొప్పిరా బాబు’’ అని కొందరు పురుషులు విసుక్కుంటుంటే.. ‘‘పోయేదేమి ఉంది...కాస్త జుత్తు తప్ప’’ అని కొందరు పురుషులు బార్బర్ ముందు తలవంచుతున్నారు. ‘‘అది అధ్యక్షుడి హెయిర్ కట్లా ఉండదు. చైనీస్ స్మగ్మర్ల హెయిర్ కట్లా ఉంటుంది’’ అంటున్నారు కిమ్ జోంగ్ అంటే మండి పడేవాళ్లు!