అచ్చెన్నా.. ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకో..
నీకు సత్తావుంటే వచ్చేఎన్నికల్లో నాపై పోటీచెయ్
నన్ను విమర్శించే వ్యక్తిత్వం నీది కాదు, నీకు లేదు
మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలపై ధర్మాన కృష్ణదాస్ ధ్వజం
ప్రియాగ్రహారం(పోలాకి): మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తరప్రగల్భాలు మానుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ హితవు పలికారు. ప్రియాగ్రహారంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ధర్మాన సోదరులపై అచ్చెన్న చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. ప్రజలు నమ్మకంతో అప్పగించిన గౌరవమైన, బాధ్యతాయుతమైన పదవికి విలువ ఇచ్చేలా వ్యవహరించాలని సూచించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్న విషయాన్ని గుర్తించాలన్నారు. మంత్రికి సత్తా ఉంటే వచ్చే ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. తను ఓడిపోతే శాశ్వితంగా రాజకీయాలకు దూరంగా ఉంటాననని, మంత్రి కూడా పత్రికాముఖంగా సవాల్‌ను స్వీకరించాలన్నారు. గతంలో స్వర్గీయ యర్రన్నాయుడు... కిల్ల కృపారాణి చేతిలో, అచ్చెన్నాయుడు... కొర్ల భారతి చేతిలో ఓటమిపాలైన విషయాన్ని మంత్రి అయిన మరుచటి రోజే మరచిపోయినట్లుందని ఎద్దేవా చేశారు. నరసన్నపేట నియోజక వర్గంలో సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని వెనకేసుకుని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి, ఎమ్మెల్యేలు పనికిమాలిన మాటలకు దూరంగా ఉండాలన్నారు. గవర్నర్‌నే గంగిరెద్దుతో పోల్చిన మంత్రి అచ్చెన్నకు నన్ను విమర్శించే వ్యక్తిత్వం లేదని గుర్తుంచుకోవాలన్నారు. మరోసారి నరసన్నపేట నియోజకవర్గంలో నోటికొచ్చినట్లు మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీలు కరిమి రాజేశ్వరరావు, దుంపల భాస్కరరావు, పార్టీ నాయకులు బెవర నూకరాజు తదితరులు ఉన్నారు.