ఎవరు పహిల్వానో తేల్చుకునేందుకే ఫైట్
నబీల్ ఘటనపై దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ
హైదరాబాద్: స్నేహితుల్లో ఎవరు పహిల్వానో తేల్చుకునేందుకే స్ట్రీట్‌ఫైట్ ఘటన చోటు చేసుకున్నట్లు దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ వెల్లడించారు. స్ట్రీట్‌ఫైట్‌లో నబీల్ మృతికి కారణమైన 9 మందిని అరెస్ట్ చేశామని, వీరిలో ఇద్దరు మైనర్లను జువైనల్‌కు పంపి మిగతా ఏడుగురిని రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. నిందితుల వద్ద నుంచి సెల్ఫోన్లు, 2 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గురువారం విలేకర్ల సమావేశంలో డీసీపీ సత్యనారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం మహ్మద్ అవేజ్ అలియాస్ ఓవేస్ పటేల్(19), మీర్జా ఉమర్ అలీ బేగ్ అలియాస్ ఉమర్ (20), వసీం ఖాన్ అలియాస్ డాలర్ వసీం(31), మీర్జా నిసారుల్లా బేగ్ అలియాస్ సుల్తాన్(22), మహ్మద్ అబ్దుల్ కవి అలియాస్ ఒబేద్ (21), మహ్మద్ సులేమానుద్దీన్ అలియాస్ సులేమాన్ (19), ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్ అలియాస్ ఇర్ఫాన్ పఠాన్(22), మరో ఇద్దరు మైనర్లతో పాటు మృతుడు నబీల్ మహ్మద్(17) స్నేహితులు.
ఈ నెల 3న ఉదయం 5 గంటల సమయంలో పంజెషాలోని ఇండో అమెరికల్ స్కూల్ వద్దకు చేరుకున్న స్నేహితులంతా తమలో ఎవరు పహిల్వానో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. స్ట్రీట్ ఫైట్‌కు ఉమర్ బేగ్ పర్యవేక్షకుడిగా వ్యవహరించగా, డాలర్ వసీం అంఫైరింగ్ చేయగా, పోరాట దృశ్యాలను ఒబేద్ సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఓవేస్‌తో ఫైట్‌కు నబీల్ను స్నేహితులు ప్రోత్సహించడంతో ఇద్దరు ఫైట్ ప్రారంభించా రు. ఓవేస్ ముష్టిఘాతాలకు దిగడంతో నబీల్ కుప్పకూలాడు. బైక్ ఫీట్ చేస్తుండగా కింద పడ్డాడని చెప్పాలంటూ ఉమర్ బేగ్ స్నేహితులందరిని ఒప్పించినబీల్ను స్థానికంగా ఉన్న దుర్రు షెహవార్ ఆస్పత్రికి తరలించారు. నబీల్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని తెలపడంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. బైక్ ఫీట్ చేస్తూ చనిపోయాడని ఫిర్యాదు చేస్తే పోస్ట్‌మార్టం నిర్వహిస్తారని, మైనర్ అయిన నబీల్ బైక్ నడిపినందుకు తల్లిదండ్రులపైనా కేసు నమోదు చేస్తారని స్నేహితులంతా నబీల్ తండ్రి దస్తగిర్‌ను నమ్మించారు.
దీంతో 4న నబీల్ మృతదేహానికి బార్కాస్‌లోని బడా శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడి ఒంటిపై గాయాలు లేకపోవడంతో అనుమానించిన దస్తగిర్ స్నేహితులను పిలిచి ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలిచ్చారు. దీంతో దస్తగిర్ 7న మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెట్లో ఫైట్ వీడియోను అప్లోడ్ చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. తల, మెడపై బలమైన గాయాలు తగలడం వల్లే నబీల్ మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా నబీల్ తన సోదరి ఫ్రెండైన ఓ యువతితో చాట్ చేయడం నిజమే అయినా, ఈ ఘటనకు దానికి సంబంధం లేదని డీసీపీ తెలిపారు. కాగా నిందితుల్లో ఒకరిద్దరి తల్లిదండ్రులకు విషయం తెలిసినా బయటకు చెప్పలేదని, వారినీ అరెస్ట్ చేస్తామన్నారు.