కేసీఆర్‌ది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం
సిద్దిపేటరూరల్ : రాష్ట్రంలో కేసీఆర్ పాలన ప్రజా వ్యతిరేక విధానాలకు అద్దం పట్టినట్టుగా ఉందని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు విమర్శించారు. గురువారం సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని పొన్నాల వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు చెక్కుల పంపిణీలో ఏ ఒక్క రైతుకు కూడా సరైన న్యాయం జరగలేదన్నారు.
వందల కొద్దీ భూములు కొనుగోలు చేసి.. భవంతుల్లో, పట్టణాల్లో ఉంటున్న భూ యజమాని లక్షల పెట్టుబడి సాయాన్ని పొందడంతో.. కౌలు రైతులు తీరని అన్యాయం జరిగిందన్నారు. రైతుబంధు ధనవంతులకు బంధువుగా మారిందని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా.. ఒక్క రైతు కుటుంబాన్ని ప్రభుత్వం పరామర్శించిన పాపాన పోలేదన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ మరచిపోయారన్నారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విచ్చలవిడిగా డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతురన్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గంప మహేందర్, బొమ్మల యాదగిరి, కలీమోద్దీన్, దాసాంజనేయ, నరేష్, శ్రీను, ఆరిఫ్, అక్బర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.