V. Narayana swamy
-
కేంద్ర మంత్రి కారు కింద బాంబు
-
కేంద్ర మంత్రి కారు కింద బాంబు!
యానాం, న్యూస్‌లైన్/పుదుచ్చేరి: కేంద్ర మంత్రి వి.నారాయణసామి కారు కింద శక్తిమంతమైన పైపు బాంబు బయటపడింది. బుధవారం వేకువజామున పుదుచ్చేరి ఎలైమనన్ కోయిల్ వీధిలోని ఆయన ఇంటి బయట నిలిపి ఉంచిన కారు అడుగున ఇది కనిపించింది. దీన్ని గమనించిన కారు డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. రెండు వైపులా మూసేసి, రెండు వైర్లు తగిలించి ఉన్న గొట్టంలాంటి ఆ బాంబును తమిళనాడు పోలీసు విభాగానికి చెందిన బాంబ్‌స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. కేజీన్నర బరువున్న ఈ బాంబుకు చిన్నచిన్న ఎలక్ట్రికల్, నాన్-ఎలక్ట్రికల్ డిటోనేటర్లు అమర్చారని పోలీసులు తెలిపారు. ఇది పేలి ఉంటే భారీ విధ్వంసం జరిగి ఉండేదని అన్నారు. ఈ ఉదంతంపై పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని డీజీపీ కామ్రాజ్ చెప్పారు. ఈ సంఘటన తర్వాత మంత్రి ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనిపై ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మంత్రి నారాయణసామి మాట్లాడుతూ.. పుదుచ్చేరిలో అసాంఘిక శక్తులు విజంభిస్తున్నాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు. బాంబు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
12వ ప్రణాళికలోనే ‘కొవ్వాడ’: నారాయణస్వామి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణువిద్యుత్తు ప్రాజెక్టు పనులు 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి వి.నారాయణస్వామి తెలిపారు. 1,500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లు కొవ్వాడలో నిర్మితమవుతాయన్నారు. ఆయన బుధవారమిక్కడ ఏఐసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో 4,780 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల 20 అణువిద్యుత్తు ప్లాంట్లు నడుస్తున్నాయని, మరో 5,300 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని ఆయన చెప్పారు. వీటి నిర్మాణంతో 2017 నాటికి 10,080 మెగావాట్ల సామర్థ్యం గల అణు విద్యుదుత్పత్తి కేంద్రాలు అందుబాటులోకి వస్తాయన్నారు. మరోవైపు 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మరో 17,400 మెగావాట్ల సామర్థ్యం గల ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం ప్రారంభమై.. 13, 14 పంచవర్ష ప్రణాళికల కాలంలో అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు.