కొవ్వాడ వైపు రెవెన్యూ అడుగులు!
రణస్థలం:అణువిద్యుత్ పార్క్ నిర్మించతలపెట్టిన కొవ్వాడ ప్రాంతంలో పర్యటించేందుకు రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వారం రోజుల్లో కొవ్వాడ బాట పట్టేలా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు రెవెన్యూసిబ్బంది అణువిద్యుత్పార్క్ ప్రాంతాలను పరిశీలించనున్నారని విశ్వసనీయ సమాచారం. వాస్తవంగా ఈ ప్రాంతంలో ఇంతవరకూ ‘అణు’ సిబ్బంది తప్పా రెవెన్యూ అధికారులు పర్యటించలేదు. అప్పట్లో ఆర్డీవో పరిశీలనకు వస్తే స్థానికులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. అప్పటినుంచి ఇప్పటి వరకూ రెవెన్యూ సిబ్బంది వెళ్లలేదు.
ఇదే విషయమై వారం రోజుల క్రితం న్యూక్లియర్ పార్క్ పీడీ వి.వెంకటరమేష్ కలెక్టర్‌ను కలిసి కొవ్వాడలో భూసేకరణ, బాధితులకు ఫ్యాకేజీలపై చర్చించినట్టు సమాచారం. అ సందర్భంగానే కొవ్వాడ ప్రాంతాన్ని రెవెన్యూ యంత్రాంగం పరిశీలించాలని నిర్ణయించింది. కలెక్టర్ నేరుగా ఈ ప్రాంతాల్లో పర్యటించి భూసేకరణ వివరాలు, ఈ ప్రాంత వాసుల నివాసాలు, వారికి ఆవాసం కల్పించడానికి చేపట్టాల్సిన చర్యలు, ప్రజలను మానసికంగా ప్లాంట్ ఏర్పాటుకు సహకరించేలా సిద్ధం చేయడం వంటి విషయాలపై చర్చించనున్నారు. ఇదివరకే జిల్లా కలెక్టర్ ఈ ప్రాంతవాసులకు కల్పించాల్సిన సౌకర్యాలకు సంబంధించి న్యూక్లియర్ అధికారులకు వివరించి ఉన్నారు. అయితే వాటిని ఏ మేరకు చేపట్టాలో తెలుసుకోవడానికి ఈ ప్రాంతంలో రెవెన్యూ సిబ్బంది పర్యటించాలని నిర్ణయించారు.
పరిస్థితి ఇది..
కొవ్వాడ ప్రాంతంలో 9,564 మెగావాట్లు సామర్ధ్యంతో నిర్మించ తలపెట్టిన అణువిద్యుత్ పార్క్‌తో దేశంలో అత్యధిక కరెంటును ఉత్పత్తి చేయనున్నారు. అణుపార్క్ ఏర్పాటుకు 2,074 ఎకరాల భూసేకరణకు ప్రతిపాదించారు. ఇందులో 791 ఎకరాలు ప్రభుత్వ భూమి, 683 ఎకరాలు పేదలకు ప్రభుత్వం ఇచ్చిన డి పట్టాభూమి ఉండగా.. 600 ఎకరాలు జిరాయితీ భూమిని సేకరించాల్సి ఉంది. రామచంద్రాపురం, టెక్కలి, కోటపాలెం, జీరుకొవ్వాడ, గూడెం ప్రాంతాల్లో ఈ భూములు ఉన్నాయి. ఇక్కడ నివసిస్తున్న జనాభా తక్కువగా ఉండటం, ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని అణుపార్క్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. శరవేగంగా పనులను చేపట్టేందుకు అన్నివిధాలా రంగం సిద్ధం చేస్తుంది.ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తో అన్ని చర్చలు జరిపిన న్యూక్లియర్ అధికారులు త్వరలోనే ప్రజలకు అందాల్సిన ప్యాకేజీలను ప్రకటించి పనులను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుంది.
ప్రభావిత గ్రామాలు ఇవే...
కొవ్వాడ పరిసరాల్లో న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా సమీప గ్రామాలైన రామచంద్రపురం, టెక్కలి, కోటపాలెం, జీరుకొవ్వాడ, గూడాం గ్రామాలకు ప్రభావం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రామచంద్రాపురంలో 3,926 మంది జనాభా ఉండగా 949 ఇళ్లు ఉన్నాయి. వ్యవసాయంతో పాటు చేపలవేట ఇక్కడ వారి వృత్తి. టెక్కలి గ్రామంలో 39 ఇళ్లలో 105 మంది జీవిస్తున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నారు. కోటపాలెంలో 920 గృహాలుండగా 3,569 జనాభా ఉంది. మత్స్యకార, వ్యవసాయ వృత్తులతో జీవిస్తున్నారు. జీరు కొవ్వాడలో 75 ఇళ్లల్లో 362 మంది జీవిస్తున్నారు. వీరికి వ్యవసాయమే జీవనాధారం. అణుపార్క్ ఏర్పాటు చేస్తే వీరంతా జీవనాధారం కోల్పోవడంతో పాటు నివాసాలు కూడా కోల్పోవాల్సి ఉంటుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితిలో రెవెన్యూ అధికారుల పర్యటన ఎలా సాగుతోందో వేచిచూడాలి.