పండగకు పుట్టింటికి తీసుకెళ్తానని..
కణెకల్(అనంతపురం): పండగకు పుట్టింటికి తీసుకెళ్తానని భార్యను బైక్ మీద తీసుకెళ్లిన భర్త.. మార్గం మధ్యలో బైక్ ఆపి ఆమెను వేట కొడవలితో నరికి చంపిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. అనంతపురం జిల్లా కణెకల్ మండలం గెనిగెర గ్రామానికి చెందిన శోభ (19)కు బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి గ్రామానికి చెందిన వడ్డె అనిల్(24)తో ఏడాది కిందట వివాహమైంది. ఈ క్రమంలో దసరా పండగకు పుట్టింటికి వెళ్దామని భార్య చెప్పడంతో ఆమెను తీసుకొని బుధవారం మధ్యాహ్నం బైక్ పై బయలు దేరారు.
దగ్గర దారి అనిచెప్పి బైక్‌ను కెనాల్ పక్కనుంచి తీసుకెళ్తూ మార్గమధ్యలో వాహనం ఆపి వెంట తెచ్చుకున్న వేట కొడవలితో ఆమెను నరికి చంపి, మృతదేహాన్ని కాలువలో పడేశాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు ఇంటికి వెళ్లాడు. పండగకు ఇంటికి వస్తానన్న కూతురు ఎంతకీ రాకపోవడంతో కంగారుపడ్డ శోభ తండ్రి వెంకటేశ్వర్లు.. బ్రహ్మసముద్రం వెళ్లి ఆరా తీశాడు. 'నాకు తెలియదు' అని అల్లుడు సమాధానమిచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన హతురాలి తండ్రి అల్లుడు అనిల్ పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అనిల్‌ను అదుపులోకి తీసుకొని తమ శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది.