ముత్యపుపందిరిపై కాళంగి మర్ధినియై..
తిరుచానూరు : పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజైన శుక్రవారం ఉదయం కాళంగి మర్ధిని రూపంలో ముత్యపుపందిరి వాహనమెక్కి అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున 2 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు, అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి వేంచేపుగా వాహనమండపానికి తీసుకొచ్చి అక్కడే సిద్ధంగా ఉంచిన ముత్యపుపందిరి వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర వజ్రవైఢూర్య స్వర్ణాభరణాలతో అమ్మవారిని కాళంగి మర్ధనం చేస్తున్న శ్రీకృష్ణునిగా అలంకరించారు.
అనంతరం 8 గంటలకు భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాలు, జియ్యర్ స్వాముల దివ్య ప్రబంధ ప్రవచనం, వేదపండితుల వేదమంత్రోచ్ఛారణ నడుమ తెల్లని, చల్లని ముత్యపుపందిరిపై అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి 8 గంటలకు సింహవాహనంపై యోగనరసింహుని అలంకరణలో అమ్మవారు భక్తులకు తిరువీధుల్లో సాక్షాత్కరించారు. వాహనసేవలో టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఏఈవో నాగరత్న, వీజీవో రవీంద్రారెడ్డి, ఏవీఎస్వో రెడ్డెప్పరెడ్డి పాల్గొన్నారు.
వాహన సేవలో పుస్తకాల ఆవిష్కరణ
తిరుచానూరు : పద్మావతి అమ్మవారి ముత్యపుపందిరి వాహన సేవలో భాగంగా శుక్రవారం ఉద యం వాహన మండపం వద్ద టీటీడీ ఈవో రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. అమ్మవారి విశేషాలు, స్త్రోత్రాలు, స్థలపురాణం, బ్రహ్మోత్సవ వైభవం వంటి అంశాలతో రచించిన అలమేలుమంగాపుర వైభవం, శ్రీవారి ఆలయంలోని రాములవారిమేడ విశేషాలతో డాక్టర్ మేడసాని మోహన్ ఈ పుస్తకాలను రచించారు. వీటిని టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, జేఈవో పోలా భాస్కర్, డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య ఆవిష్కరించారు.
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారు ఆవిర్భవించిన పద్మసరోవరం(పుష్కరిణి) నిర్మాణమే ఓ అద్భుతం. నాటి కాలపు పనితీరుకు నిదర్శనం. పుష్కరిణి నైరుతి, ఈశాన్యం మూలల్లో భారీ తూములను ఏర్పాటుచేశారు. పొన్నకాలువ నుంచి ఒక పాయ గుండా ప్రవహించే నీరు నైరుతి మూలలోని తూము గుండా పుష్కరిణికి చేరేది. పుష్కరిణి నిండిన తరువాత ఈశాన్యం మూల నుంచి నీరు (ప్రస్తుతం కాలువగడ్డ వీధిలోని కాలువ) గుండా ప్రవహిస్తూ దామినేడు చెరువుకు వెళ్లేది.
అలా పుష్కరిణిలో నీళ్లు ఎప్పుడు స్వచ్ఛంగా ఉండేది. అయితే కాలువలు అంతరించాక పుష్కరిణిలోకి నీరు రాకపోవడంతో నిల్వ చేరి పాచిపట్టేది. ఇప్పుడు పుష్కరిణిలోకి బోరు నీటి ద్వారా నీటిని నింపుతున్నారు. ఐదేళ్ల క్రితం సిమెంటు కాంక్రీటు వేశారు. నీళ్లు పరిశుభ్రంగా, తాజాగా ఉండేందుకు ఫిల్టర్లు ఏర్పాటుచేసి క్లోరిన్‌తో శుభ్రం చేస్తున్నారు. భద్రత దృష్ట్యా చుట్టూ ఇనుప గ్రిల్స్‌ను ఏర్పాటుచేశారు.