ఇదో అద్భుత కాన్వాస్!
మెదక్ జిల్లాలో బయల్పడిన పురాతన వర్ణచిత్రాలు
- ఒకే గుండుపై వివిధ కాలాలకు చెందిన అరుదైన చిత్రాలు
- ప్రతిబింబిస్తున్న ఆదిమానవుల జీవనవిధానం
సాక్షి, హైదరాబాద్ : అది 25 అడుగుల ఎతైన భారీ గుండు.. ఏ మూల చూసినా అద్భుత వర్ణచిత్రాలు.. పదునైన మొన ఉన్న పరికరంతో తొలిచిన మరికొన్ని చిత్రాలు.. వ్యవసాయ చిహ్నమైన ఎద్దు.. జీవవైవిధ్యాన్ని ప్రతిబింబించేలా నెమళ్లు, దుప్పులు, పిచ్చుకలు.. జీవ కోటికి ప్రాణాధారమైన నీరు.. వెలుగులు నింపే సూర్యుడు.. నాటి జీవనంలో భాగమైన వేట.. మరోవైపు ఆధ్యాత్మిక చిహ్నాలు... వెరసి ఆ గుండు ఓ భారీ కాన్వాసునే తలపిస్తోంది. ఈ కాన్వాస్ ఇప్పటిప్పుడే ఏర్పడింది కాదు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దాదాపు 10 వేల సంవత్సరాల్లో పలు కాలాల్లో గీసిన చిత్రాల సమాహారమే ఈ గుండు.
మెదక్జిల్లా శివంపేట మండలం పరిధిలోని రత్నాపూర్ శివారులో ఈ బండ తాజాగా వెలుగులోకి వచ్చింది. తిరుమలాయ బండ అని పిలిచే గుట్ట భాగంలో ఇది బయల్పడింది. 40 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ గుండుపై రకరకాల చిత్రాలున్నాయి. నవీన శిలాయుగం, తామ్ర శిలాయుగం, బృహత్ శిలాయుగం.. ఇలా ఆదిమానవులు వివిధ కాలాల్లో ఈ బండపై బొమ్మలు చిత్రించి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. నగ్నంగా ఉన్న మనిషి, ఆ పక్కన ఎరుపు రంగుతో నింపిన భారీ మూపురం ఉన్న ఎద్దు, రకరకాల గీతలతో పలు చిత్రాలు, వంకర కొమ్ములున్న దుప్పి, నెమళ్లు, వేటాడే దృశ్యం, నీరు ఇలా రకరకాల బొమ్మలున్నాయి.
ఇక ఆ గుట్టలో శిథిలమైన వైష్ణవ దేవాలయం కూడా ఉంది. అందులో విగ్రహాలు మాత్రం లేవు. విష్ణుకుండినుల కాలం నాటివిగా భావిస్తున్న పెట్రోగ్లిఫ్స్ (పదునైన మొన ఉన్న వస్తువుతో తొలిచిన బొమ్మలు) ఉన్నాయి. వీటిల్లో తిరునామాలు, శంఖ చక్రాలను పోలిన బొమ్మలున్నాయి. ఆదిమానవుల జీవనానికి సజీవ సాక్ష్యంగా భావించే రాతి వర్ణచిత్రాలు తరచూ అక్కడక్కడా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఒకే కాలంలో గీసిన చిత్రాలున్న జాడలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఒకే రాతిపై వేల సంవత్సరాల్లో వివిధ కాలాలకు చెందిన మానవుల బొమ్మలు చిత్రించిన దాఖలాలు మాత్రం చాలా అరుదు. అలాంటిది ఈ గుండు మాత్రం అన్ని కాలాలకు చెందిన ఆదిమానవుల జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. దీన్ని స్థానికులైన నర్సింహారెడ్డి గుర్తించి కొత్త తెలంగాణ బృంద సభ్యులు మురళీ కృష్ణ, హరగోపాల్, నాగరాజు, మోహన్రెడ్డిల దృష్టికి తీసుకెళ్లటంతో వారు వీటిని అధ్యయనం చేశారు.