రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ చేతికి వాల్కాంబీ
ఒప్పందం విలువ రూ. 2,600 కోట్లు..
- ప్రపంచంలోనే అతిపెద్ద
- గోల్డ్ రిఫైనరీ సంస్థ వాల్కాంబీ
ముంబై: జ్యుయలరీ సంస్థ రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ తాజాగా స్విట్జర్లాండ్‌కి చెందిన పసిడి రిఫైనరీ సంస్థ వాల్కాంబీని కొనుగోలు చేసింది. ఈ ఒప్పంద ం విలువ సుమారు రూ. 2,560 కోట్లు. ఇది పూర్తిగా నగదు డీల్ అని సంస్థ ఎండీ ప్రశాంత్ మెహతా తెలిపారు. వచ్చే 2-3 ఏళ్లలో తాము బంగారం మైనింగ్‌లోకి కూడా ప్రవేశించాలని యోచిస్తున్నామని, వాల్కాంబీ కొనుగోలు అందుకు తోడ్పడగలదని చెప్పారాయన.
రాబోయే రోజుల్లో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ (ఆర్ఈఎల్) ఆదాయాలు పెరిగేందుకూ ఇది గణనీయంగా ఉపయోగపడగలదన్నారు. వాల్కాంబీ అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో ఉన్న తమ రిఫైనరీని విస్తరించనున్నట్లు మెహతా పేర్కొన్నారు. భారత్, చైనా, మధ్యప్రాచ్యం తదితర కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడానికి ఆర్ఈఎల్తో భాగస్వామ్యం తోడ్పడగలదని వాల్కాంబీ సీఈవో మైఖేల్ మెసారిక్ చెప్పారు.
డీల్‌కు సంబంధించి క్రెడిట్ సూసీ 30-35 శాతం మొత్తాన్ని దీర్ఘకాలిక రుణ ప్రాతిపదికన సమకూర్చిందని, మిగతా దానికి సంస్థ అంతర్గత నిధులను ఉపయోగించుకున్నట్లు మెహతా చెప్పారు. మొత్తం రుణాన్ని నాలుగేళ్లలో తీర్చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనరీ సంస్థగా నిలుస్తున్న వాల్కాంబీ గడచిన మూడేళ్లలో ఏటా సుమారు 945 టన్నుల బంగారం, 325 టన్నుల వెండి శుద్ధి చేయడం, విక్రయించడం ద్వారా సగటున 38 బిలియన్ డాలర్ల మేర (రూ.2,36,500 కోట్లు) ఆదాయాలు నమోదు చేసిందని మెహతా వివరించారు.
ఇక, 14 రాష్ట్రాలకు ముడి వస్తువులు సరఫరా చేస్తున్న తమకు మెజారిటీ మార్కెట్ వాటా (50%) ఉందన్నారు. ‘శుభ్’ బ్రాండ్ పేరిట ఉన్న తమ రిటైల్ స్టోర్స్ సంఖ్యను వచ్చే మూడేళ్లలో గణనీయంగా పెంచుకోనున్నట్లు మెహతా తెలిపారు. ప్రస్తుతం 82 స్టోర్స్ ఉన్నాయని, 2018 నాటికి సొంత అవుట్‌లెట్స్, ఫ్రాంచైజీ విధానాల్లో 450కి ఈ సంఖ్యను పెంచుకోనున్నట్లు వివరించారు.