వంశధార ట్రిబ్యునల్ తీర్పు: వైఎస్సార్ దార్శనికతకు నిదర్శనం
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపు.. నిబద్ధత.. దార్శనికత కారణంగానే రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ (వీడబ్ల్యూడీటీ) తుది తీర్పు ఇచ్చిందని నీటిపారుదల రంగ, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలతోపాటు మిగులు జలాలపై పూర్తి హక్కును దక్కించుకోవాలంటే.. వాటిని వినియోగించుకునేలా ప్రాజెక్టులు నిర్మించాలంటూ 1985 నుంచి 2004 వరకూ ప్రభుత్వాలకు వైఎస్సార్ సూచిస్తూ వచ్చారు.
కృష్ణా, దాని ఉప నదులు, పెన్నా, దాని ఉప నది చిత్రావతిలపై కర్ణాటక సర్కార్ 1995 నుంచి 2004 మధ్య అనుమతి లేకుండా అనేక ప్రాజెక్టులు చేపట్టింది. ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ.. కృష్ణా మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు సంపూర్ణ హక్కు రావాలంటే పెండింగ్ ప్రాజెక్టులను చేపట్టాలంటూ అప్పటి సీఎం చంద్రబాబును నాటి ప్రతిపక్ష నేత వైఎస్సార్ డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. పర్యవసానంగా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 ఉమ్మడి ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా తీర్పు ఇచ్చింది. మిగులు జలాలను మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. దీనివల్ల మిగులు జలాలపై హక్కును ఏపీ కోల్పోవాల్సి వచ్చింది.
జలయజ్ఞం కింద ఒకేసారి 85 ప్రాజెక్టులకు శ్రీకారం
మే 14, 2004న వైఎస్సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జలయజ్ఞం కింద ఒకేసారి 85 ప్రాజెక్టులను చేపట్టారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చాలనే లక్ష్యంతో.. 1962 నుంచి కాగితాలకే పరిమితమైన వంశధార ప్రాజెక్టు ఫేజ్–2, స్టేజ్–2ను ఫిబ్రవరి 25, 2005న మొదలుపెట్టారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మించి.. రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కులను హైలెవల్ కాలువ ద్వారా తరలించి.. సింగిడి (0.686), పారాపురం (0.404), హిర మండలం (19.05)లో టీఎంసీలను నిల్వ చేయాలని ప్రణాళిక రచించారు.
తద్వారా వంశధార ప్రాజెక్టు తొలి దశ కింద 2.10 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటూ కొత్తగా 45 వేల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలో వంశధార ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లందించవచ్చు. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన నేరడి బ్యారేజీ వల్ల తమ భూభాగం ముంపునకు గురవుతుందని ఒడిశా సర్కార్ అభ్యంతరం తెలుపుతూ 2006లో కేంద్రానికి ఫిర్యాదు చేసింది.
ఒకవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయపరమైన వివాదాలను పరిష్కరిస్తూనే.. మరోవైపు ప్రాజెక్టు ముందస్తు ఫలాలను శ్రీకాకుళం జిల్లా రైతులకు అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్ డిజైన్‌ను మార్చారు. నేరడి బ్యారేజీ స్థానంలో కాట్రగడ్డ వద్ద సైడ్‌వియర్ (మత్తడి) నిర్మించి.. అక్కడి నుంచి సింగిడి, పారాపురం, హిర మండలం రిజర్వాయర్లకు తరలించేలా డిజైన్ చేసి పనులు చేపట్టారు. 2009 నాటికే సింహభాగం పనులను పూర్తి చేశారు.
వైఎస్సార్ వల్లే రాష్ట్రానికి న్యాయం..
ఆంధ్రప్రదేశ్, ఒడిశా వాదనను ఏళ్ల తరబడి విచారించిన వంశధార ట్రిబ్యునల్ సెప్టెంబర్ 13, 2017న తుది తీర్పు ఇచ్చింది. ఆ తీర్పునే సోమవారం ఖరారు చేసింది. దివంగత సీఎం వైఎస్సార్ చేపట్టిన కాట్రగడ్డ సైడ్వియర్తోపాటు ప్రతిపాదించిన నేరడి బ్యారేజీకి ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. వంశధారలో 57.5 టీఎంసీలను వినియోగించుకునే పూర్తి స్వేచ్ఛను ఏపీకి ఇచ్చింది.
వైఎస్సార్ ముందుచూపుతో వంశధార ప్రాజెక్టు ఫేజ్–2 స్టేజ్–2 చేపట్టకున్నా.. ప్రాజెక్టు ఫలాలను ముందస్తుగా రైతుకు అందించాలనే నిబద్ధతతో కాట్రగడ్డ సైడ్‌వియర్ నిర్మాణాన్ని చేపట్టకపోయినా.. ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వ వాదనతో విభేదించి ఉండేదని న్యాయ నిపుణులు తేల్చిచెబుతున్నారు.
చదవండి: గ్రామ సచివాలయాల్లోనూ ఆధార్ సేవలు