దేశ ప్రగతికి పల్లెలే ఆధారం
విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి వంగల అమరనాథ్రామ్
అల్లూరు(ముదినేపల్లి రూరల్) : పల్లెల సౌభాగ్యంపైనే దేశ ప్రగతి ఆధారపడి ఉందని విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి వంగల అమర్ నాథ్‌రామ్ అన్నారు. భారత మాజీ రాష్ట్రపతి వీవీ గిరి సమీప బంధువు, అమర్నాధ్ తల్లి వంగల వాణీబాయి రామ్ మండలంలోని అల్లూరు గ్రామానికి చెందినవారు. వాణీబాయి రామ్, శివరామ్ దంపతుల జ్ఞాపకార్థం అమర్నాథ్ గ్రామంలో జెడ్పీ హైస్కూల్ నిర్మించారు. హైస్కూల్లో వాణీబాయి రామ్ శత జయంత్యుత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సర్పంచి కోయినాని పద్మావతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అమర్నాథ్ మాట్లాడారు.
కన్నతల్లి, జన్మభూమి రుణం తీర్చుకోవడం ఏ స్థాయిలోని వారికైనా కనీస బాధ్యత అన్నారు. గ్రామాల్లో మట్టిలో మాణి క్యాల్లాంటి విద్యార్థులున్నప్పటికీ సరైన మార్గ నిర్ధేశం లేని కారణంగా వారి మేధాశక్తి కనుమరుగవుతోందన్నారు. ఇలాంటి వారిని గుర్తించి వెలుగులోకి తేవాల్సిన బాధ్యత ప్రముఖ రంగాల్లో స్థిరపడిన వ్యక్తులపై ఉందన్నారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ విద్యతోనే ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చని అమర్నాథ్రామ్ నిరూపించారన్నారు. ఎంతో సదాశయంతో స్థానికంగా నిర్మించిన జెడ్పీ హైస్కూల్ అభివృద్ధికి తనవంతు సాయం అందిస్తానని పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి వీవీ గిరి కుమార్తె, అమర్నాథ్ భార్య శాంతిరామ్ మాట్లాడుతూ పల్లెలు సుభిక్షంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మేధావులు, ప్రభుత్వాలపై ఉందన్నారు.
గ్రామస్తులు అమర్నాథ్, శాంతి రామ్ దంపతులను ఘనంగా సత్కరించారు. సోమేశ్వర స్వామి ఆలయాభివృద్ధికి రామ్ దంపతులు రూ.50వేలు, జెడ్పీ హైస్కూల్లో ఫర్నీచర్‌కు రూ.20వేలు, ప్రతిభ చూపే విద్యార్థులకు రూ.25వేలు విరాళంగా ఇచ్చారు.
జెడ్పీ వైస్ చైర్మన్ శాయిన పుష్పావతి, జెడ్పీటీసీ భూపతి నాగకల్యాణి, ఎంపీపీ పోసిన కుమారి, ఎంపీటీసీ చలసాని లక్ష్మీపార్వతి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఈడ్పుగంటి వెంకట్రామయ్య, చలమలశెట్టి రామానుజయ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లా వెంకన్న, పార్టీ మండల అధ్యక్షుడు కొత్తూరి విఠల్, ఎంపీడీవో విద్యాసాగర్, ఎంఈవో సైకం సుబ్రహ్మణ్యం, ఎస్సై వీ సతీష్, ప్రధానోపాధ్యాయుడు డేవిడ్‌రాజు, దావు నాగరాజు, లక్ష్మణరావు, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.