పుత్రభిక్ష పెట్టరూ..
జనగామ, న్యూస్‌లైన్ : ఉన్నత చదువులు చదివి తనకోసం తల్లి పడుతున్న కష్టాలను తీర్చాలనుకున్న ఆ యువకుడు ఇప్పుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మంచానికే పరిమితమై ఆదుకునే ఆపన్నహస్తం కోసం కళ్లలో ప్రా ణాలు పెట్టుకుని ఎదురుచూస్తున్నాడు. జనగామకు చెందిన వంగపల్లి కనకరాజు తండ్రి చిన్నతనంలో మరణించాడు. తల్లి బాలలక్ష్మి రెక్కల కష్టంతో కొడుకును పెంచి పెద్దచేసింది. చదువుకు ఆటంకం రాకుండా జాగ్రత్త పడుతూ కష్టాన్ని కొడుకుకు తెలియనివ్వకుండా జాగ్రత్తగా పెంచింది. ప్రస్తుతం కనకరాజు.. ప్రసాద్ ఇంజినీరింగ్ కళాశాలలో బీఫార్మసీ చదువుతున్నాడు. ఇతనికి ఇంటర్ చదువుతున్న తమ్ముడు, ఓ కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న అన్నయ్య ఉన్నారు. ఉన్నంతలో హాయిగా జీవి తం సాగిపోతోందని అనుకుంటున్న సమయంలో జీవితం లో పెను విషాదం చోటుచేసుకుంది.
బయటపడిందిలా..
మూడేళ్లక్రితం ఒంట్లో నలతగా ఉంటే ఆస్పత్రికి వెళ్లిన కనకరాజు గుండెపగిలే వార్త వినాల్సి వచ్చింది. కిడ్నీలు రెండూ పాడయ్యాయని వైద్యులు చెప్పడంతో తల్లి నిర్ఘాంతపోయింది. ఇక అప్పటి నుంచి వైద్యం కోసం ఆస్పత్రులన్నీ తి రుగుతున్నారు. ఫలితంగా చదువు మధ్యలోనే ఆగిపోయిం ది. డయాలసిస్ కోసం నెలకు రూ.25వేలు ఖర్చుచేస్తున్నా రు. కనీసం ఒక కిడ్నీ అయినా మార్పిడి చేస్తే తప్ప విద్యార్థి బతికే అవకాశం లేకపోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. చేతికొచ్చిన కొడుకు మంచాన పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోతోంది. కొడుకు ప్రాణాలు నిలబెట్టుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. తన కిడ్నీ ఇచ్చినా ఆపరేషన్‌కు సుమారు రూ.14లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో, అంత సొమ్ము ఎక్కడి నుంచి తేవాలో తెలియక తల్లడిల్లుతోంది. ప్రభుత్వం, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తే తప్ప కిడ్నీ మార్పిడి సాధ్యం కాదు కనుక వారి సహాయం కోసం దీనంగా అర్థిస్తోంది. కనకరాజు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఆయన చ దువుకున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు చందా లు పోగేసి రూ.12500 అందించారు.