సంపూర్ణ వినియోగం
బౌద్ధ వాణి
బుద్ధుడు జేతవనంలో ఉన్నప్పుడు ధర్మరక్షితుడు అనే భిక్షువు వచ్చి ఒక కొత్త చీవరం (భిక్షువులు ధరించే వస్త్రం) కావాలని అడిగాడు.
‘‘ధర్మరక్షితా! ఇంతకు ముందు నీకిచ్చిన వస్త్రం ఏమైంది?’’ అని అడిగాడు బుద్ధుడు.
‘‘భగవాన్! చినిగిపోయింది’’
‘‘ఆ చినిగిన చీవరాన్ని ఏం చేశావు?’’
‘‘భగవాన్! చినుగులు కుట్టుకుని ధరించాను. ఇక కుట్టుకోడానికి కూడా వీలు లేనంతగా జీర్ణమైపోయింది’’.
‘‘ఆ జీర్ణ వస్త్రాన్ని ఏం చేశావు?’’
‘‘భంతే! దాన్ని మడతలుగా చేసి ధ్యానం చేయడానికి కూర్చొనే దిండుగా వాడాను’’.
‘‘ఆ దిండును ఇంకా ఉపయోగిస్తున్నావా?’’
‘‘లేదు భగవాన్, అదీ చివికి పోయి ముక్కలైపోయింది. ఆ ముక్కలతో గదిని శుభ్రం చేశాను. మట్టి అరుగు అలికాను’’.
‘‘మంచిది. ఆ చివికిన ముక్కలు ఇంకా మిగిలే ఉన్నాయా?’’
‘‘లేదు భగవాన్! అవి ఇంకా చివికి చివికి దారప్పోగులైపోయాయి. ఆ దారప్పోగులను సరిచేసి, పేని, దీపాలు వెలిగించే ఒత్తులుగా మార్చి ఉపయోగించాను’’.
‘‘ధర్మరక్షితా! మంచిది. ప్రతి వస్తువూ ఏదో ఒక దశలో ఏదో ఒక పనికి ఉపయోగపడుతుంది. ఆ వస్తువుని అలా సంపూర్ణంగా వినియోగించుకుంటే వస్తు ఉపయోగం పెరిగి, వస్తు వ్యామోహం తగ్గిపోతుంది. నీవు కొత్త చీవరానికి అర్హుడివే’’ అని కొత్త చీవరం ఇప్పించాడు బుద్ధుడు.
- బొర్రా గోవర్థన్