చెన్నై సెంట్రల్
తెలుగువారి కబుర్లు
తెలుగువారి త్యాగసభ
వాణీమహల్ లేదా శ్రీత్యాగబ్రహ్మ గానసభ... ఈ సభ నిర్మాణంలో తెరవెనుక తెలుగువారు ఉన్నారు...ఈ నిర్మాణం జరగడానికి పెద్ద కథే ఉంది... స్వర్ణయుగంగా పిలువబడే నాటి ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడే దీనికి అంకురార్పణ చేశారు... లీజ్‌కి తీసుకున్న స్థలాన్ని కొనుగోలు చేసే స్థాయికి తెచ్చారు... ఎందరో చలనచిత్ర రంగ ప్రముఖులు ఇక్కడ అరంగేట్రం చేశారు...
మరెందరో సంగీత ప్రముఖులు ఈ సభకు వన్నె తెచ్చారు... చెన్నైలో తెలుగువారి ఖ్యాతికి శాశ్వత చిరునామాగా సమున్నతంగా నిలిపారు... 1944 నాటి సంఘటన. ఆరోజు... ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు హోరున వాన కురుస్తోంది. సాధారణంగానైతే ఎవ్వరూ గడప దాటి బయటకు రాలేని పరిస్థితి అది. అందుకు విరుద్ధంగా ఆ రోజు టి. నగర్ బస్ స్టాప్‌లో జనంతో కిటకిటలాడిపోతోంది. గొడుగులు ధరించినవారు, ధరించని వారు కూడా ఆ కుంభవృష్టిలో తడుస్తూ నిలబడ్డారు. సరిగ్గా అదే సమయానికి కారులో అటుగా వెళ్తున్నారు నాగయ్య. జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యం కచేరీకి వెళ్లడం కోసమే వారంతా వానను సైతం లెక్కచేయట్లేదని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
చెన్నైలోని మైలాపూర్ కర్ణాటక సంగీతానికి పట్టుకొమ్మ. సంగీతామృతాన్ని ఆస్వాదించేవారంతా మైలాపూర్ వెళ్లాల్సిందే. వానక జడిసి ఇంట్లో కూర్చుంటే కచేరీని వినలేకపోతామనేంత నిబద్ధత వీరికి సంగీతం పట్ల. సంగీత ప్రేమికులైన వీరందరికీ టి.నగర్లోనే అందుబాటులో ఒక సభ నిర్మిస్తే ఏ ఒడిదొడుకులు లేకుండా సంగీతంలో తన్మయులు కావచ్చు కదా! అని నాగయ్య మదిలో ఆలోచన తళుక్కుమంది. ఆలోచన వచ్చినదే తడవుగా ఆచరణలో పెట్టేశారు.
నాగయ్యగారి శ్రమ వృథా పోలేదు. ఆయన సదుద్దేశానికి చేయూత లభించింది. జిఎన్.చెట్టి, డా. నాయర్ రోడ్ల సంగమ స్థానంలో ఉన్న 24000 చదరపు అడుగుల ఖాళీ స్థలాన్ని ఆ యజమాని అయిన ప్రముఖ న్యాయవాది టిఏ రంగాచారి నామమాత్రపు ధరకు లీజ్‌కి ఇచ్చారు. నాగయ్య నాయకత్వంలో అనేకమంది సభ్యుల సహాయ సహకారాలతో సభానిర్మాణం జరిగింది. ఈ సభా నిర్మాణానికి నిధుల కోసం 16 రోజుల పాటు నాటకోత్సవాలు నిర్వహించారు. ప్రారంభోత్సవం హిందీప్రచారసభ ప్రాంగణంలో జరిగింది. కొంతకాలం సభలన్నీ ఆ ప్రాంగణంలోనే జరిగాయి. సభకు ప్రాచుర్యం విస్తృతంగా పెరగడంతో ఈ సభల నిర్వహణకు ఒక శాశ్వత వేదిక ఉంటే మంచిదని భావించారు. ఆ తరువాత ప్రస్తుతం ఉన్న స్థలాన్ని సంపాదించుకున్నారు. నాగయ్య కారణంగా ఈ సభ రూపుదిద్దుకుంది కనుక ఈ సభకు ఆయన పేరును నిర్ణయిద్దామనుకున్నారు. అయితే ఆయన సున్నితంగా తిరస్కరించి, ‘శ్రీత్యాగ బ్రహ్మ గానసభ’ పేరు స్థిరపరిచారు. దీని రూపకర్త వి. గణపతి అయ్యర్. దీనిని ట్రావన్‌కోర్ దివాన్ రామస్వామి అయ్యర్ నవంబరు18, 1945న ప్రారంభించారు. తమ ప్రారంభోపన్యాసంలో ‘త్యాగరాయనగర్‌లోని కొందరు స్థానికుల చందాలతో ఈ సభ నిర్మాణం జరిగింది. ఈ సభను నాటక, సంగీత ప్రదర్శనల కోసం ప్రారంభించారు. ఈ సభ కళలను అభివృద్ధి చేయడానికి ప్రారంభించబడింది’ అంటూ రామస్వామి అయ్యర్ రిబ్బన్ కట్ చేశారు. ఆయన సంగీతాభిమాని. 1944లో చిత్తూరు వి నాగయ్య ప్రారంభించిన ఈ సభలో జరిగిన మొట్టమొదటి కచేరీ శ్రీ అరియకూడి రామానుజ అయ్యంగార్ది. ఇందులో వయొలిన్ మీద శ్రీపప్పు కె.ఎస్. వెంకట్రామయ్య, మృదంగం మీద పాలఘాట్ టి.ఎస్.మణి అయ్యర్ సహకరించారు. మొట్టమొదటి కచేరీకి అయిన ఖర్చు 5000. ఆ మొత్తాన్ని చిత్తూరు నాగయ్య విరాళంగా ఇచ్చారు. 1930 నాటికి పెద్ద సరస్సు ప్రాంతం సంగీత నిలయంగా మారిపోయింది.
ఈ సభ గోడల దగ్గర నుంచి అన్నీ ఆకర్షణీయంగా అందంగా రూపొందించారు. ఈ కొత్త వేదిక మీద గోపీనాథ్ - తంగమణి ‘వాణీ మహల్’ అనే పేరున తమ బ్యాలేతో మొట్టమొదటి ప్రదర్శన ఇచ్చారు. 1973లో ‘వాణీ మహల్’ అనే పేరును ఈ సభకు జత చేశారు. వాణీమహల్ అంటే సరస్వతీదేవి నివాసం అని అర్థం. ప్రముఖ హాస్య నటుడు నగేశ్, హిందీ చలన చిత్ర కథానాయిక వహీదా రెహమాన్ ఇక్కడే వారి కళా యాత్ర ప్రారంభించారు. ఓరియంటల్ డ్యాన్సెస్’ శీర్షికన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత ఇక్కడ నాట్య ప్రదర్శన ఇచ్చారు.
చెన్నపట్టణంలో ఇది అత్యంత ప్రాచీనమైనసభ. సంగీత ప్రేమికులకు ఇదొక ప్రియమైన వేదిక. ఎం.ఎల్. వసంతకుమారి, కె.జె.ఏసుదాసు వంటి ప్రముఖుల కచేరీలు వాణీ మహల్లో సర్వసాధారణం. ప్రతి సంవత్సరం వాణీ మహల్లో డిసెంబరు మాసంలో మార్గళి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. వివిధ కళలలో నిష్ణాతులైనవారికి ‘వాణీ కళా సుధాకర’ బిరుదు, లక్ష రూపాయల నగదుబహుమతి ప్రదానం చేస్తున్నారు.
చెన్నై సభలలో మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ ఉన్న సభ వాణీమహల్. ఆమె లేడీ వెంకటసుబ్బారావు.
చిత్తూరు వి. నాగయ్య సుమారు 70 సంవత్సరాల క్రితం నాటిన విత్తనం నేడు మహావృక్షమై ఎందరికో నీడను, ఫలాలను అందిస్తోంది. నాగయ్య చేసిన నిస్వార్థ సేవకు నిలువెత్తు సాక్ష్యంగా చెన్నై మహానగరంలో ఠీవిగా కనపడుతుంది వాణీమహల్.
సంభాషణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై