ఓవీఎల్ - వాంకోర్ డీల్ కు రష్యా ఆమోదం
♦ 15 శాతం వాటాల కొనుగోలుకు ఓకే
♦ జూన్‌లోగా పూర్తి కానున్న ప్రక్రియ
న్యూఢిల్లీ: రష్యా చమురు దిగ్గజ కంపెనీ రాస్‌నెఫ్ట్ నుంచి వాంకోర్ చమురు క్షేత్రంలో ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్) 15% వాటాలు కొనుగోలు చేసే డీల్‌కు రష్యా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించి అక్కడి ఫెడరల్ యాంటీమోనోపొలీ సర్వీస్ (ఎఫ్ఏఎస్) నుంచి అనుమతులు లభించినట్లు ఓవీఎల్ ఎండీ నరేంద్ర కె వర్మ తెలిపారు. ఇక వాంకోర్ క్షేత్ర డెవలపింగ్ సంస్థ వాంకోర్‌నెఫ్ట్‌లో తమకు బోర్డు పదవులు కేటాయిస్తుందని, తద్వారా కంపెనీని విక్రయ సంస్థ రాస్‌నెఫ్ట్ పునర్వ్యవస్థీకరిస్తుందని ఆయన వివరించారు. ఈ ప్రక్రియంతా జూన్ నాటికి పూర్తి కాగలదని అంచనా.
ఓఎన్జీసీ ఇప్పటిదాకా కుదుర్చుకున్న అతి పెద్ద డీల్స్‌లో వాంకోర్ది నాలుగోది అవుతుంది. సుమారు 1.268 బిలియన్ డాలర్ల విలువ చేసే 15% వాటాల కొనుగోలుకు ఓవీఎల్ గతేడాది సెప్టెంబర్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని 26 శాతానికి పెంచుకునేందుకు ఈ ఏడాది మార్చిలో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది. అదనంగా వాటాల కొనుగోలుకు కూడా ఎఫ్ఏఎస్ నుంచి ఆమోదముద్ర అవసరమా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదని వర్మ పేర్కొన్నారు.