వాన్‌పిక్ భూముల్లో పాగా
ఆక్రమణల చెరలో భూములు
అక్రమంగా రొయ్యల చెరువుల తవ్వకం
ఎన్వోసీ కోసం అధికారులపై ఒత్తిళ్లు
ఒంగోలు : వాన్‌పిక్ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఖాళీగా ఉన్న భూములను చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. అక్కడ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు అధికారులపై ఎన్ఓసీ కోసం ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే కోర్టులో ఉన్న ఈ భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రకాశం, గుంటూరు జిల్లాల తీర ప్రాంతంలో పరిశ్రమల కోసం వాన్‌పిక్ పేరుతో ప్రభుత్వం సుమారు 28 వేల ఎకరాల భూమిని సేకరించింది. వేటపాలెం నుంచి కొత్తపట్నం వరకూ 13 వేల ఎకరాల భూమిని వాన్‌పిక్ కోసం కేటాయించింది.
అందులో ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి పోగా సుమారు ఎనిమిది వేల ఎకరాల వరకూ రైతుల నుంచి కొనుగోలు చేశారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాన్‌పిక్ ప్రాజెక్టును రద్దు చేశాయి. ఈ వివాదంపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఇందులో కొన్ని భూములను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ జప్తు చేసింది. దీంతో ఈ భూములు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ భూముల్లో గతంలో వాన్‌పిక్‌కు అమ్మిన రైతులే మళ్లీ సాగు చేసుకుంటుండగా, మరికొన్ని భూములపై ఆక్రమణదారుల కన్ను పడింది. ప్రభుత్వ, అసైన్డ్ భూములను బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఆక్రమించి అందులో రొయ్యల చెరువులు తవ్వుతున్నారు. ఒంగోలు రూరల్ మండలంలోని గుండాయపాలెం, దేవరంపాడు గ్రామాల్లో వాన్‌పిక్ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి.
గుండాయపాలెంలో రైతులు తమ భూములను ఎకరా రూ.50 వేల నుంచి రూ.లక్షన్నర వరకూ వాన్‌పిక్‌కు అమ్మారు. ఇందులో ఎక్కువ చేపల, రొయ్యల చెరువులు ఉన్నాయి. వాన్‌పిక్ వివాదంలో పడటంతో ఈ భూములు అమ్మిన గ్రామస్తులు మళ్లీ వాటిని తమ స్వాధీనం చేసుకుని బయట వ్యక్తులకు లీజులకు ఇచ్చారు. మరికొంత మంది స్వయంగా సాగు చేసుకుంటున్నారు. వీటిలో చాలా వాటికి గతంలోనే విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాన్‌పిక్ భూముల్లోనే ఒక ప్రైవేటు కంపెనీ వంద ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువులు సాగు చేస్తోండగా, పది ఎకరాలకు పైగా సాగు చేస్తున్న వారు పదుల సంఖ్యలో ఉన్నారు. సాగు చేసుకుంటున్నవారు చెరువులకు నీరు పెట్టుకోవడం కోసం సొంతగా పెద్ద పెద్ద పంపింగ్ స్టేషన్లే ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.
మత్స్యశాఖ అధికారుల నుంచి చేపల, రొయ్యల చెరువుల కోసం అనుమతులు తీసుకుని ఆ పత్రాల ద్వారా ఎన్వోసీ కోసం రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కోర్టులో వివాదం నడుస్తుండగా ఈ భూములను ఎన్వోసీ ఇస్తే తమ ఉద్యోగానికి ముప్పు వస్తుందని రెవెన్యూ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆక్రమణదారులు అధికార పార్టీని అడ్డం పెట్టుకుని ఎన్ఓసీ కోసం ఒత్తిడి చేస్తున్నారు. ఇటీవల గుండాయపాలెంలో వాన్‌పిక్ భూమిలో ఒక వ్యక్తి మూడు ఎకరాల్లో రొయ్యల చెరువు తవ్వి దీనికి ఎన్వోసీ కోసం ఒంగోలు తహ శీల్దార్ కార్యాలయంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. అధికారులు సహకరించకపోవడంతో వారిని బదిలీ చేయించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.