వైభవంగా వరలక్ష్మీ వ్రతాలు
బోట్‌క్లబ్ (కాకినాడ), న్యూస్‌లైన్ : బాలాత్రిపురసుందరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా జరిగాయి. సుమారు నాలుగు వేల మంది మహిళలు సంప్రదాయబద్ధంగా వ్రతాలు ఆచరించారు. ఉదయం 6 గంటల నుంచి ఆలయ ప్రాంగణం మహిళలతో కిక్కిరిసింది. ఆలయ ప్రధానార్చకుడు చెరుకూరి రాజా ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సతీమణి మహాలక్ష్మి జ్యోతిప్రజ్వలన చేసి సామూహిక వ్రతాల కార్యక్రమం ప్రారంభించారు.
ఈ పూజల్లో పాల్గొన్నమహిళలకు చీర, జాకెట్, రూపు, అమ్మవారి ప్రతిమతో పాటు 36 రకాల పూజా సామగ్రిని అందజేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ జొన్నాడ చిన్నబాబు చెప్పారు. అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదిత్య మెరైన్స్ అధినేత ఎన్వీ రాంబాబు ఆధ్వర్యంలో భారీ అన్న సంతర్పణ జరిగింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ ఈఓ సీహెచ్ విజయభాస్కరరెడ్డి ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వెలగల గంగాభవాని, కంపర అప్పారావు, సోమిరెడ్డి వెంకటేశ్వరస్వామి, ఎల్లబోయిన సత్యనారాయణ, ఆలయ అర్చకుడు చెరుకూరి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.