వేసింది ఖాకీ దుస్తులే.. కానీ!
పోలీసులు అనగానే.. ఖాకీ దుస్తుల కరకుదనమే మన కళ్లముందు కనిపిస్తుంది. లాఠీ పట్టుకుని ఎవరినైనా అదిలించడం, బెదరించడమే మనం ఇన్నాళ్లూ చూస్తూ వచ్చాం. కానీ, నాణేనికి రెండోవైపు చూస్తే వాళ్లలోనూ మానవత్వం ఉంది. తీవ్రమైన సమస్యల పట్ల స్పందించే హృదయం ఉంది. వారణాసిలోని ఫూల్పూర్ పోలీసు స్టేషన్ ఇన్చార్జి సంజీవ్ మిశ్రా ఇలాంటి మానవత్వానికి నిలువెత్తు రూపం అంటూ సోషల్ మీడియాలో హల్చల్ నడుస్తోంది. అదేంటో మీరూ చూడండి..
తన ఏరియాతో సంబంధం లేకపోయినా.. ఆస్పత్రిలో ఓ పాప చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నట్లు మిశ్రాకు సమాచారం అందింది. తన పరిధి అయినా, కాకపోయినా ఆయన ఊరుకోలేదు.. వెంటనే పరుగున ఆ ఆస్పత్రికి వెళ్లారు. ఆమెను అక్కడినుంచి వేరే ఆస్పత్రికి తరలిద్దామని చూస్తే, ఆస్పత్రి వర్గాలు ఏమాత్రం సహకరించలేదు. అయినా ఆయన ఊరుకోలేదు. స్ట్రెచర్లు, అంబులెన్సుల గురించి వేచి చూడలేదు. తన చేతుల్లోకి ఆ చిన్నారిని ఎత్తుకుని ఓ ప్రైవేటు ఆస్పత్రికి బయల్దేరారు. అంతటితో అయిపోలేదు.. ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె చికిత్సకు అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారంటూ చుట్టుపక్కల వాళ్లు నస పెట్టారు. 'నేనే భరిస్తా.. నేనే ఆమె సంరక్షకుడిని' అని ఇన్స్పెక్టర్ మిశ్రా స్పష్టంగా చెప్పారు.
ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆ బాలికపై ఓ మధ్యవయసు వ్యక్తి అత్యాచారం చేశాడు. అతడిని పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. అయితే ఆ నిరుపేద బాలికను మాత్రం పట్టించుకునేవాళ్లు ఎవరూ లేకపోవడంతో ఆస్పత్రి వర్గాలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. దాంతో ఇన్స్పెక్టర్ సంజీవ్ మిశ్రా మాత్రం ఊరుకోకుండా.. తన మానవత్వాన్ని నిరూపించుకున్నారు.