తీవ్రం కానున్న ‘వార్దా’ తుపాను
విశాఖపట్నం: ‘వార్దా’ తుపాను గంట గంటకూ బలపడుతూ కోస్తాంధ్ర వైపు కదులుతోంది. తక్కువ వేగంతో పయనిస్తూ ఎక్కువ ప్రభావం చూపబోతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తుపాను ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. శుక్రవారం రాత్రి విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 950, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 1,050 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం ఉదయానికల్లా తీవ్ర తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
ఈ నెల 11 వరకు తీవ్ర తుపానుగానే కొనసాగుతుందని, అనంతరం కాస్త బలహీన పడుతూ కోస్తాంధ్ర తీరం వైపు వస్తుం దని తెలిపింది. 12న మధ్యాహ్నానికి లేదా సాయం త్రానికి ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం – నెల్లూరు మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో కోస్తాంధ్రలో గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమై న పెను గాలులు వీయవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.