కోలీవుడ్‌లో మరో తెలుగమ్మాయి
కోలీవుడ్‌లో ఇప్పటివరకు, బాలీవుడ్, మాలీవుడ్ హీరోయిన్ల హవానే కొనసాగుతోంది. తాజాగా తమిళ దర్శక నిర్మాతల దృష్టి టాలీవుడ్ భామలపై పడుతోంది. ఇప్పటికే కలర్స్ స్వాతి, బిందుమాధవిలాంటి టాలీవుడ్ బ్యూటీలు కోలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. మరో యువ నటి దివ్యశ్రీ వరుత్తపడాదవాలిబర్ సంఘం చిత్రం ద్వారా తెరంగేట్రం చేసి తొలి చిత్రంతోనే హిట్ నాయకి పేరును సొంతం చేసుకుంది. ప్రస్తుతం, యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ సరసన పెన్సిల్ తదితర చిత్రాలతో బిజీ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా మరో తెలుగమ్మాయి శ్రీముఖి కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతోంది.
ఇంతకు ముందు రాటినం వంటి విజయవంతమైన చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టిన కె.ఎస్.తంగసామి తాజాగా దర్శకత్వం వహిస్తూ ముఖ్య భూమికను పోషిస్తున్న చిత్రం ఎట్టుతిక్కుం మదయానై.. ఆర్య తమ్ముడు సత్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీముఖి హీరోయిన్గా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్ అంటూ కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై శ్రీముఖి చాలా ఆశలు పెట్టుకుందట. ఆమె మాట్లాడుతూ తొలి చిత్రంలోనే నటనకు అవకాశం ఉన్న బలమైన పాత్ర లభించడం సంతోషంగా ఉందని పేర్కొంది. ఎట్టుతిక్కు మదయానై కోలీవుడ్‌లో తనకు మంచి బ్రేక్‌నిస్తుందనే నమ్మకం ఉన్నట్టు తెలిపింది. చిత్ర దర్శకుడు కె.ఎస్.తంగసామి కూడా శ్రీముఖికి తమిళ భాష తెలియకపోయినా చెప్పింది అర్థం చేసుకుని చక్కగా నటించిందని కితాబిస్తున్నారు.