భార్యను పొడిచిన కేసులో ఎన్నారైకి జైలు శిక్ష
సింగపూర్: భార్యను కత్తితో పోడిచిన కేసులో భారతీయ సంతతికి చెందిన సురేష్ డేవిడ్ నర్శింహులకు 10 నెలల జైలుశిక్ష విధిస్తూ సింగపూర్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. గతేడాది అక్టోబర్‌లో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్శింహులు తన భార్య వసంతకుమారీతోపాటు తన ఇద్దరు చిన్నారులను లిటిల్ ఇండియాలోని రేస్ కోర్సు రోడ్డులో షాపింగ్‌కి తీసుకువెళ్లారు. ఆ క్రమంలో నర్శింహులు, వసంత కుమారీల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
దీంతో ఆగ్రహించిన నర్శింహులు తన వద్ద ఉన్న కత్తితో వసంతకుమారీ పొత్తికడుపులో పొడిచాడు. దీంతో రక్తపుమడుగులో ఆమె కుప్పకూలింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని.. బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నర్శింహులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు శుక్రవారం నిందితుడికి 10 నెలల జైలు శిక్ష ఖరారు చేస్తు తీర్పు వెలువరించింది. భార్య భర్తల మధ్య మనస్పర్థలు కారణంగా విడిపోయి జీవనం సాగిస్తున్నారని.... అయితే దీపావళి పండగ నేపథ్యంలో పిల్లలతో కలసి భార్య వసంత కుమారిని షాషింగ్ తీసుకువెళ్లాడని... ఆ క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని స్థానిక మీడియా కథనాన్ని వెలువరించింది.