తెలుసుకోవాల్సిన పుస్తకం
డెడ్ సోల్స్
Voice of the voicelessV గా ఉండాలి
రచయిత అన్నాడు నికొలాయ్ వాసిలీలిచ్ గొగోల్ (1809 - 1852). అంతేగాదు.
‘అధికార మదాంధుల్ని, నియంతల్ని, మన మీద సవారీ చేస్తున్న, మనల్ని దోపిడీ చేస్తున్న దుర్మార్గుల్ని ఎద్దేవా చెయ్యి’ అని తనను తాను నిరంతరం హెచ్చరించుకున్నాడు. అలాగ ఆనాడు రష్యాలో అమలులో ఉన్న అర్ధబానిస విధానం (సెర్ఫ్డమ్) లో రైతు కూలీల్ని భూస్వాములు వినియోగ వస్తువుల్లా కొనుక్కోవటాన్ని వ్యంగ్యంగా చిత్రించి పాఠకుల చేత కన్నీరు పెట్టించాడు గొగోల్. ఇందులో చిచికోవ్ అనబడేవాడు ప్రతి భూస్వామి దగ్గరకూ వెళ్లి అతడి వద్ద చచ్చిన కూలీల్ని కొనుక్కుని బ్యాంకులకు తాకట్టు పెట్టి డబ్బు చేసుకుంటాడు. ఆనాటి రైతుల దుర్భర,దయనీయ పరిస్థితులు రాతిబండలను కూడా కరిగిస్తాయి. వాళ్ల బతుకులు పశువుల కన్నా అధ్వాన్నం. భూలోక నరకాన్ని మన కళ్ల ముందు దర్శింప చేసిన రచయిత- ‘వ్యవస్థ మారాలి’ అని ప్రత్యేకంగా వ్యాఖ్యానం చేయనవసరం లేదు. దీనిని ‘మృతజీవులు’ అనే పేరుతో కొ.కు. తెలుగు అనువాదం చేశారు. ఇటీవల సంక్షిప్తరూపంలో పీకాక్ క్లాసిక్స్ ఎడిటర్ గాంధీ అనువాదం చేశారు. మార్కెట్లో ఉంది.
డాన్ క్విక్సాట్
షేక్స్పియర్కు సమకాలీనుడైన స్పానిష్ రచయిత మిగ్వెల్ ది సెర్వాంటెస్ (1547-1616), తన వృద్ధాప్యంలో రాసిన పెద్ద నవల ఇది. (ఖఠజీౌ్ఠ్ట్ఛను ‘కియోటీ’గా ఉచ్ఛరిస్తారు). మొదటి భాగం 1605లో వెలువడింది. అడ్వెంచర్ పుస్తకాలు చదివి. బుర్ర పాడుచేసుకొని తనూ అడ్వెంచర్లు చెయ్యటానికి బయల్దేరిన అమాయకుడి ‘సాహస’ యాత్రలు చదవలేక పొట్ట చేత పట్టుకుని నవ్వని పాఠకులుండరు. రెండవ భాగం మరో పదేళ్ల తర్వాత వెలువడింది. ఇది చదివినవాళ్లు దీన్నో గొప్ప తాత్విక నవలగా బైబిల్ ఆఫ్ హ్యుమానిటీగా అభివర్ణించారు. ఈ పుస్తకాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ప్రతి పాఠకుడూ దీన్ని కనీసం మూడుసార్లు- యవ్వనంలో, మధ్య వయసులో, వృద్ధాప్యంలో చదవాలంటారు. అస్తిత్వవాద సిద్ధాంతాన్ని (ఎగ్జిస్టెన్షియలిజం) ప్రతిపాదించిన జాన్ పాల్ సార్త్ ్రలాంటి తత్త్వవేత్తలకు ప్రేరణ డాన్ కియోటీ.
- ముక్తవరం పార్థసారథి
కథాసంధి: సాహిత్య అకాడెమీ ఫిబ్రవరి 7 సాయంత్రం ఐదున్నరకి కడప సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ‘కథాసంధి’ కార్యక్రమం నిర్వహించనుంది. సుంకోజి దేవేంద్రాచారి తన కథను పఠనం చేసి పాఠకులతో సంభాషిస్తారు. ఫిబ్రవరి 8న అదే ప్రాంగణంలో దళిత రచయిత పాలా వెంకట సుబ్బయ్య జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వివరాలకు: 9440222117