కొడుకుని చంపిన తండ్రి
గుంతకల్లు : చిల్లర దొంగతనాలు, చిన్న నేరాలకు పాల్పడుతూ తమ పరువు తీస్తున్నాడని భావించిన ఓ తండ్రి తన సొంత కొడుకును గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన మంగళవారం అనంతపురం జిల్లా గుంతకట్టు పట్టణంలోని అంకాలమ్మగుడి వీధిలో చోటు చేసుకుంది. వివరాలు.. అంకాలమ్మగుడి వీధిలో నివాసముండే వశీకేరి కొడుకు ధనుంజయ్ (20) గత కొంతకాలంగా చిల్లర నేరాలకు పాల్పడుతున్నాడు. దీంతో ధనుంజయ్‌ను తండ్రి పలుమార్లు మందలించాడు.
తండ్రి మాటలను ధనుంజయ్ పెడచెవిన పెట్టాడు. అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ధనుంజయ్ తండ్రి మంగళవారం గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. స్థానికులు ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన వశీకేరి నివాసానికి చేరుకున్నారు. అనంతరం ధనుంజయ్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి వశీకేరిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.