పశువైద్య కళాశాలను తనిఖీ చేసిన వీసీఐ బృందం
ప్రొద్దుటూరు: స్థానిక ప్రభుత్వ పశువైద్య కళాశాలను దక్షిణ భారత పశువైద్య మండలి (వీసీఐ) బృందం గురువారం సందర్శించింది. కళాశాల నడుస్తున్న భవనాలతోపాటు గోపవరం సమీపంలో నిర్మించిన నూతన భవనాలను పూర్తిగా పరిశీలించారు. జంతువధశాల, దాణా కేంద్రం, చికిత్స, బోధనశాలలు, కోళ్ల, పశుపెంపకాలతోపాటు అన్ని డిపార్ట్మెంట్లలో తిరిగి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ అంశాలపై కళాశాల డీన్ జగదీశ్వరరావుతో చర్చించారు. అధ్యాపకులు తగినంత మంది ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా డిపార్ట్మెంట్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. 2008లో ప్రారంభించిన ఈ కళాశాలకు ఇప్పటి వరకు వీసీఐ గుర్తింపు లేదు. దీంతో కళాశాల మనుగడే ప్రశ్నార్థకమైంది.
ఈ నేపథ్యంలో వసతులను పరిశీలించేందుకు ప్రస్తుతం వీరు ఇక్కడికి వచ్చారు. వీసీఐ బృందంలో కలకత్తాకు చెందిన డాక్టర్ గోస్వామి, మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ పురియా, హర్యానా రాష్ట్రానికి చెందిన రాజేష్‌కుమార్ ఉన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌తోపాటు అధ్యాపకులు ఆనందరెడ్డి, జగపతిరామయ్య, రవీంద్రారెడ్డి, వరప్రసాదరెడ్డి, సురేష్‌కుమార్, సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. వీసీఐ బృందం మరో రెండు రోజుల పాటు ఇక్కడే ఉంటుందని తెలియవచ్చింది.