ఉత్తరాంధ్ర యువతికి ఐఏఎస్
వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కుమార్తెకు సివిల్స్‌లో 71వ ర్యాంకు
* 23 ఏళ్లకే విజయం సాధించిన వేదితా రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కుమార్తె వేదితా రెడ్డి 23 ఏళ్లకే ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. శనివారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఈమె 71వ ర్యాంకు సాధించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి రెడ్డి నాగభూషణ్‌రావు, రెడ్డి శాంతి కుమార్తె వేదితా రెడ్డి.
తల్లి స్వస్థలం శ్రీకాకుళం. తండ్రి స్వస్థలం విజయనగరం. ఉత్తరాంధ్ర వెనకబాటుతనమే వేదితను సివిల్స్ వైపు అడుగులు వేసేలా చేసింది. దాద్రానగర్‌లో ఆరో తరగతి వరకు చదివిన వేదిత.. ఏడో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఢిల్లీలోని సంస్కృతి పాఠశాలలో చదివారు. నోయిడాలో 2013లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీటెక్ పూర్తిచేసి తొలిసారి సివిల్స్ రాసినా ఆశించిన ర్యాంకు రాలేదు.
‘‘నేరుగా ఐఏఎస్ దక్కడం ఆనందంగా ఉంది. నాకు అమ్మానాన్నలే స్ఫూర్తి. ఏపీ క్యాడర్‌కే మొదటి ఆప్షన్ ఇచ్చా. రాష్ట్రంలో మా ప్రాంతం చాలా వెనకబాటుకు గురైంది. మహిళల సాధికారత లక్ష్యంగా పనిచేయాల్సి ఉంది. పూర్తిస్థాయి సంతృప్తి ఉంటుంద నే సివిల్స్ లక్ష్యంగా చదివా’’ అని వేదితా రెడ్డి పేర్కొన్నారు.