18 ఏళ్లు దాటినా 8 ఏళ్ల పిల్లాడిలా!
నెలకు రూ.46వేలు ఖర్చు పెడితే ఫలితం
ఆరు నెలలుగా కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణ
కర్నూలు : ఈ ఫొటోలో తండ్రి పక్కన కనిపిస్తున్న పిల్లాడి పేరు వీరకుమార్. చూడ్డానికి 8 ఏళ్ల వయస్సు గలవానిగా కనిపిస్తాడు. కానీ ఇతని వయస్సు ప్రస్తుతం 18 ఏళ్లు. అరుదుగా వచ్చే ఎదుగుదలలోపం వ్యాధి ఈ బాలున్ని వేధిస్తోంది. నెలకు రూ.46వేల ఖరీదు చేసే ఇన్జెక్షన్లు వేస్తే గానీ ఫలితం ఉండని పరిస్థితి. ఇందుకోసం కలెక్టరేట్ చుట్టూ ఆరు నెలలుగా ప్రదక్షిణ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు.
కోడుమూరు మండలం గోరంట్ల గ్రామానికి చెందిన ఆర్. రాముడు, సుంకులమ్మ దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. ఇతనికి వర్షాధారపొలం ఉంది. వర్షం రాకపోతే దంపతులిద్దరూ వ్యవసాయకూలీలుగా మారిపోతారు. ఇలాంటి జీవితాన్ని గడుపుతున్న వీరికి ఆర్. వీరకుమార్ ఏకైక కుమారుడు. అతనికి పుట్టకతోనే పిట్యుటరీ గ్రంథి సమస్య ఏర్పడింది. ఇది సరిగ్గా పనిచేయకపోవడంతో ఎదుగుదల లోపం ఏర్పడింది.
చిన్నతనం నుంచి పలువురు వైద్యులను కలిసి చికిత్స చేయిస్తూనే ఉన్నారు. చివరికి పెద్దాసుపత్రి వైద్యులు ఓ సలహా ఇచ్చారు. ఈ బాలునికి 25 ఏళ్లు వచ్చేవరకు ప్రతి నెలా రెండు హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తే ఎదుగుదల వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆరు నెలల వరకు తన వద్ద ఉన్న డబ్బుతో ఇంజెక్షన్లను కొని ఇప్పించారు. ఆ తర్వాత డబ్బు లేకపోవడంతో పెద్దాసుపత్రి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
ప్రతి 15 రోజులకు ఒకసారి రూ.13,104ల విలువజేసే హార్మోన్ ఇంజెక్షన్ వేయించాలి. నెలకు రూ.26వేలకు పైగానే ఈ బాలుని కోసం ఖర్చు చేయాలి. ఇంత ఖర్చు చేయాలంటే తమ పరిధిలో లేదని, జిల్లా కలెక్టర్‌ను కలవాలని ఆసుపత్రి అధికారులు చేతులెత్తేశారు. దీంతో రాముడు తన కుమారున్ని వెంటపెట్టుకుని ప్రతి సారి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. 18 ఏళ్లు వచ్చినా 8 ఏళ్ల పిల్లోడిగా కనిపించే తన కుమారున్ని చూసి జాలి చూపాలని ఆయన అధికారులను వేడుకుంటున్నారు. నెలకు రూ.26వేలు ఖర్చు చేసే స్థోమత తనకు లేదని, అధికారులు హార్మోన్ ఇంజెక్షన్లు వేయించాలని వేడుకుంటున్నారు.