Vem Narender Reddys son Krishna kirtan
-
కూపీ లాగుతున్న ఏసీబీ!
* వేం నరేందర్‌రెడ్డి కుమారుడిని రెండోరోజూ విచారించిన అధికారులు * ఉదయసింహ, సెబాస్టియన్‌లతో కలిపి కృష్ణకీర్తన్‌కు ప్రశ్నలు * టీడీపీ నేతల తర్ఫీదును వ్యూహాత్మకంగా తిప్పికొడుతున్న ఏసీబీ * ఆర్థిక మూలాలకు సంబంధించి కీలక సమాచారం సేకరణ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నేతలకు ఊహించని షాక్‌లు ఎదురవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్‌ను ఈ కేసులో ఏసీబీ అధికారులు రెండో రోజు గురువారం కూడా సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరిగిన ఈ విచారణలో.. కృష్ణకీర్తన్‌తో పాటు ఉదయ సింహ, సెబాస్టియన్లను కూడా కలిపి విచారించారు. తొలుత ఈ ముగ్గురిని ఫోన్‌కాల్స్ ఆధారంగా విడివిడిగా ప్రశ్నించగా.. వారు చెప్పిన కొన్ని సమాధానాల మధ్య పొంతన కుదరనట్లు తెలిసింది. దాంతో అందరినీ ఒకేచోట కూర్చోబెట్టి డబ్బుల వ్యవహారానికి సంబంధించి అడగగా.. తొలుత మౌనమే సమాధానమైనట్లు సమాచారం. దాదాపు ఏడు గంటల పాటు సాగిన విచారణలో చివరకు కొన్ని కీలక అంశాలతో పాటు ఈ కేసులో ఆర్థిక మూలాలకు సంబంధించిన విషయాలను సేకరించినట్లు తెలిసింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకునేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తోంది. అడ్డంగా దొరికిపోయిన కృష్ణకీర్తన్! ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కృష్ణకీర్తన్ పాత్రకు సంబంధించి ఏసీబీ వద్ద ముందే కొంత సమాచారముంది. దాని ఆధారంగా ఆయనను బుధవారం పిలిపించి, విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాదిరిగానే కృష్ణకీర్తన్ కూడా బాగా ‘తర్ఫీదు’ తీసుకున్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. కేసుకు సంబంధించిన నిందితులు, అనుమానితులు, సాక్షులుగా ఉన్నవారు వ్యక్తిగత విచారణలో మొండికేస్తుండటంతో.. ఏసీబీ రూటు మార్చింది. విడివిడిగా విచారించినప్పుడు బయటపడిన అంశాల్లోని సందేహాలను, మూకుమ్మడి విచారణలో తీర్చుకుంటోంది. రెండో రోజు విచారణకు రావాల్సిందిగా బుధవారమే కృష్ణకీర్తన్‌ను ఆదేశించిన ఏసీబీ... గురువారం ఉదయం హఠాత్తుగా ఉదయసింహ, సెబాస్టియన్లను కూడా పిలిపించింది. వారిద్దరినీ చూడగానే కృష్ణకీర్తన్ కంగుతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆయన మొదటి రోజు చెప్పిన విషయాలను ఉదయసింహ, సెబాస్టియన్ల ముందు మరోసారి ప్రస్తావించే సరికి నీళ్లు నమిలినట్లు సమాచారం. దీంతో భయాందోళనకు గురైన కృష్ణకీర్తన్.. డబ్బులకు సంబంధించి కీలక సమాచారం వెల్లడించినట్లు తెలుస్తోంది. బిగుసుకుంటున్న ఉచ్చు వేం నరేందర్‌రెడ్డికి ఉచ్చు బిగుసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కృష్ణకీర్తన్‌ను విచారించిన నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన అంశాలతో నరేందర్‌రెడ్డి పాత్రపై ఏసీబీకి పలు అనుమానాలు కలిగినట్లు సమాచారం. వాటిని నివృత్తి చేసుకోవడం కోసం నరేందర్‌రెడ్డిని మరోసారి విచారించాలని భావిస్తోంది. అయితే ఆయనను ఈ కేసులో సాక్షిగా భావిస్తూ నోటీసులు జారీ చేయాలా, నిందితుడిగానా అన్నదానిపై దర్యాప్తు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో దీనిపై ఓ నిర్ణయానికి రానున్నారు. -
ఆర్థిక మూలాలపైనే దృష్టి!
సాక్షి, హైదరాబాద్: దాదాపు రూ.150 కోట్ల ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో ఇప్పటికే సూత్రధారి, పాత్రధారులు ఎవరనేదానిపై ఒక నిర్ధారణకు వచ్చిన ఏసీబీ.. ఇప్పుడు మిగతా కీలకాంశాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రేవంత్‌రెడ్డి ఇవ్వజూపిన రూ.50 లక్షలు, ఇస్తానని హామీ ఇచ్చిన మిగతా రూ.4.5 కోట్లకు సంబంధించిన ఆర్థిక మూలాలపై లోతుగా ఆరా తీస్తోంది. కేసు దర్యాప్తులో ఇది కీలక కోణమని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి బుధవారం టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్‌ను ఏసీబీ సుదీర్ఘంగా విచారించింది. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం నోటీసులు జారీ చేయడంతో బుధవారం ఉదయం 10 గంటలకు కృష్ణకీర్తన్ ఏసీబీ కార్యాలయానికి వచ్చారు.దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు వివిధ కోణాల్లో ఆయన్ను ప్రశ్నించినట్లు తెలిసింది. సుదీర్ఘ విచారణలో కృష్ణకీర్తన్ కాస్త ఆందోళనకు గురైనట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా విచారణ ముగియకపోవడంతో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ఆందోళన చెందిన కుటుంబీకులు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే చివరకు కీర్తన్ ఏసీబీ కార్యాలయం నుంచి సాయంత్రం 6.40 గంటల సమయంలో బయటకు వచ్చారు. అంతా నాన్నగారే చూస్తారు! ‘‘రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను. నాన్నగారు ఎప్పుడూ కూడా మాతో రాజకీయ విషయాలు చర్చించరు. వాటిపట్ల నాకు ఆసక్తి ఉండదు. అంతా నాన్నగారే చూసుకుంటారు..’’ అని కృష్ణకీర్తన్ ఏసీబీ విచారణలో అన్నట్లు సమాచారం. అయితే ఏసీబీ కూడా ఆయన నుంచి సమాచారం రాబట్టేందుకు పలు రకాల ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. కృష్ణకీర్తన్ ఫోన్ నుంచి పలుసార్లు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్లకు కాల్స్ వెళ్లడంపై ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. ‘నా ఫోన్ నుంచి మా తండ్రి వేం నరేందర్‌రెడ్డి మాట్లాడారు’ అని కీర్తన్ చెప్పినట్లు తెలుస్తోంది. మే 31న స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇవ్వడానికి వెళ్లే ముందు రేవంత్‌తోపాటు ఉదయసింహ ఇద్దరూ వేం నరేందర్‌రెడ్డితో సంప్రదింపులు జరిపినప్పుడు కృష్ణకీర్తన్ కూడా అక్కడే ఉన్నట్లు ఏసీబీ ప్రాథమికంగా భావిస్తోంది. ఈ దిశగా డబ్బులకు సంబంధించి కృష్ణకు ఏసీబీ కీలక ప్రశ్నలు సంధించినప్పటికీ ఆయన్నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసింది. కొందరు టీడీపీ నాయకులు తమ ఇంటికి వచ్చినప్పుడు చూడటమే తప్ప, వారితో ప్రత్యేకించి మాట్లాడిన సందర్భాలు లేవని చెప్పినట్లు సమాచారం. వేంను మళ్లీ పిలిచే అవకాశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేం నరేందర్‌రెడ్డిని ఏసీబీ మరోసారి విచారణకు పిలవాలని భావిస్తోంది. కృష్ణకీర్తన్ విచారణ తర్వాత ‘ఆర్థికాంశాల’పై ఏసీబీకి ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. వేం నరేందర్‌రెడ్డిని మరోసారి పిలిచి పూర్తిస్థాయి విచారణ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో వేం నరేందర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈసారి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి విచారణకు సహకరించకపోతే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.