25న అన్నమయ్య జయంతోత్సవాలు
కూచిపూడి: అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు 606వ జయంతి, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం 85వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈనెల 25న నిర్వహించనున్నట్లు కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్ చెప్పారు.
కృష్ణాజిల్లా కూచిపూడిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచేకాక అమెరికాలో కూచిపూడి నాట్యాన్ని ప్రచారం చేస్తున్న 22 మంది నాట్యాచార్యుల శిష్యబృందాలు అన్నమయ్య సంకీర్తనలను ప్రదర్శిస్తారని చెప్పారు. ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు.
అదే రోజు సాయంత్రం హైదరాబాద్లోని ఆర్ట్స్ అండ్ లెటర్స్ ఆడిటోరియంలో(ఇందిరాపార్కు సిగ్నల్స్ వద్ద) సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ 124వ జయంతి ఉత్సవం జరుపనున్నట్టు కేశవప్రసాద్ ప్రకటించారు.