వేముల రెవిన్యూ కార్యాలయంలో ఆన్లైన్ బంద్
వేముల(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా వేముల మండల కేంద్రంలోని రెవిన్యూ కార్యాలయంలో ఆన్లైన్ సౌకర్యం పని చేయడంలేదు. దీంతో బుధవారం కార్యాలయానికి కుల ధ్రువీకరణ, ఆదాయ పన్ను, ఇతర వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన ప్రజలకు తిప్పలు తప్పటంలేదు. కాగా, ఆన్లైన్ సౌకర్యం మంగళవారం నుంచి పని చేయకపోయినా రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెవిన్యూ కార్యాలయానికి ఇంటర్నెట్ సౌకర్యం అందించే తీగలు ఎప్పుడు గాల్లోనే వేలాడుతాయని, ఏదైనా వాహనం తీగలకు తగిలితే రెండు రోజుల పాటు సేవలు నిలిచిపోవడం ఇక్కడ సాధారణ విషయమని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి తగిన చర్యలు తీసుకొని ఆన్లైన్ సేవలను పునరుద్ధరించాలని.. తిరిగి ఈ సమస్యల తలెత్తకుండా శాశ్వతంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.