రాజన్న క్షేత్రానికి సరికొత్త కళ
♦ యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి
♦ నమూనాలు సిద్ధం.. త్వరలో సీఎం పరిశీలన
♦ శృంగేరీ పీఠాధిపతి ఆమోదం తర్వాత పనులు
♦ కొత్త డిజైన్లను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి ఆల యాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్న తరహాలో వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని రూపుదిద్దడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆలయ అభివృద్ధి నమూనాలు కూడా సిద్ధమయ్యాయి. ఆర్కిటెక్ట్‌లు రూపొం దించిన ఈ నమూనాలను సోమవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. వీటిని త్వరలోనే ముఖ్యమంత్రికి చూపించి ఆయన చేసే సూచనల ఆధారంగా మార్పు చేర్పులు చేయనున్నారు. అనంతరం శృంగేరీ పీఠాధిపతికి చూపించనున్నారు. పీఠాధిపతి సూచించే మార్పులను కూడా పరిగణనలోకి తీసుకుని తుది నమూనాలు సిద్ధం చేయనున్నట్టు ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. రెండో ప్రాకార మండపం, ఆలయ రాజగోపురం, నిత్యకల్యాణ మండపాలను ఎలా తీర్చిదిద్దనున్నారో ఈ నమూనాల ద్వారా ఆర్కిటెక్ట్‌లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వివరించారు. ఈ సమావేశంలో మంత్రి వెంట వేములవాడ ఎమ్మెల్యే రమేశ్, దేవాదాయశాఖ కార్యదర్శి శివశంకర్, వేములవాడ అథారిటీ వైస్ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, ఆలయ ఈవో రాజేశ్వర్, స్థపతి వల్లినాయగం, విజువల్ ఆర్కిటెక్ట్ నాగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.