రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
వేములవాడఅర్బన్ : వేములవాడ రాజన్న సన్నిధానం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు తలనీలాలు, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అభిషేక మంటపంతో పాటు, బాలత్రిపురాసుందరీదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు చేశారు. రద్దీ పెరిగిపోవడంతో క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈవో కృష్ణాజీరావు, ఏఈవోలు గౌరీనాథ్, ఉమారాణి ఏర్పాట్లను పరిశీలించారు. సోమవారం ఆలయానికి రూ. 9 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
నేడు రాజన్న ఆలయ ఈవో ఉద్యోగ విరమణ
వేములవాడఅర్బన్ : వేములవాడ రాజన్న ఆలయ ఈవో కృష్ణాజీరావు మంగళవారం ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఇన్ని రోజులు ఇక్కడ సేవలందించి, అందరితో కలుపుగోలుగా ఉన్న ఆయనను ఘనంగా సన్మానించేందుకు ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతున్నాయి. అయితే తనకెలాంటి ఆర్భాటాలు అవసరం లేదని, సాదాసీదాగానే ఉద్యోగ విరమణ చేస్తానని ఈవో ఉద్యోగులతో అన్నట్లు సమాచారం.
రాజన్న ఆలయ ఈవోగా రాజేశ్వర్
కరీంనగర్ కల్చరల్: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఇన్చార్జి ఈవో గా కరీంనగర్ దేవాదాయశాఖ సహాయ కమిషనర్ దూస రాజేశ్వర్‌ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయంలో ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న క ృష్ణాజీరావు మంగళవారం రిటైర్డ్ కానున్నారు. రాజేశ్వర్ మంగళవారమే బాధ్యతలు స్వీకరిస్తారు.