ముంపు బెంగతో మృతి
తొగుట: కొమురవెల్లి మల్లన్న సాగర్‌లో తమ గ్రామం ముంపునకు గురవుతుందన్న బెంగతో గుండెపోటుకు గురై ఆటో డ్రైవర్ మరణించిన ఘటన మెదక్ జిల్లా తొగుట మండలం వేములఘాట్‌లో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన ఎండీ మైమూద్ హుస్సేన్ (41)కు ఎలాంటి భూములు లేకపోవడంతో గ్రామంలో ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెండు నెలలుగా ముంపు నుంచి తమ గ్రామాన్ని మినహాయించాలని గ్రామస్తులు నిర్వహించిన ఆందోళనలో హుస్సేన్ చురుకుగా పాల్గొన్నారు. గత నెల 24న రాజీవ్ రహదారి ముట్టడికి వెళ్తుండగా పోలీస్‌లు జరిపిన లాఠీచార్జిలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ముంపునకు గురవుతుందనే బెంగ అధికమైంది.
ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున తీవ్ర మనస్తాపంతో గుండె పోటుకు గురయ్యారు. వెంటనే సిద్దిపేట ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. హుస్సేన్‌కు భార్య గౌస్యా, కుమారులు సాహేద్, జాహేద్, కుమార్తె మేహజ్ ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని గ్రామస్తులు కోరారు.