యూటీకి బాబు, మోడీ కుట్ర
తెలంగాణలో పోలింగ్ అయిపోగానే.. మోడీతో హైదరాబాద్ యూటీ హామీ ఇప్పించాలని చూస్తున్నరు: కేసీఆర్
సాక్షి నెట్వర్క్: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, వెంకయ్యనాయుడు కుట్రలు పన్నుతున్నారని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు మండిపడ్డారు. సీమాంధ్రుల ఓట్లు రాబట్టుకునేందుకు.. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే.. 30వ తేదీ సాయంత్రంగానీ, మే 1నగానీ హైదరాబాద్‌ను యూటీ చేస్తామని మోడీ ద్వారా ప్రకటన చేయించనున్నట్లు తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు.
చంద్రబాబు, మోడీ తెలంగాణ ద్రోహులని.. వారికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రంగారెడ్డి జిల్లా తాండూరు, పరిగి, మెదక్ జిల్లా సంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సనత్‌నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో జరిగిన సభల్లో కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణను ముంచే యత్నం..
‘‘హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, వెంకయ్యనాయుడు కుట్రలు చేస్తున్నరు. సీమాంధ్రుల ఓట్ల కోసం మోడీతో హైదరాబాద్‌ను యూటీ చేస్తామని.. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రకటన చేయించనున్నట్లు మాకు సమాచారం ఉంది’’ అని కేసీఆర్ చెప్పారు. ‘‘మిస్టర్ మోడీ.. తెలంగాణను ముంచడానికే సీమాంధ్రలో ఆలస్యంగా మేనిఫెస్టో విడుదల చేసి.. ఆంధ్రను పదేళ్లు స్పెషల్ కేటగిరీ రాష్ట్రంగా ప్రకటిస్తరా..?’’ అని మండిపడ్డారు.
ఆంధ్ర నాయకులతో కలిసి మోడీ తెలంగాణతో శతృత్వం పెట్టుకున్నారని.. టీడీపీతో జతకట్టి తన కాళ్లు తానే విరగ్గొట్టుకున్నాడని విమర్శించారు. మోడీ, బాబు, పవన్ కలిసి వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ మొత్తం 111 కాదని.. దానితో మోడీకి పంగనామాలే గతి అని కేసీఆర్ విమర్శించారు. ‘‘రాష్ట్ర ఏర్పాటుతో తల్లి మరణించింది.. బిడ్డ మిగిలిందంటూ మాట్లాడుతున్న మోడీ తెలంగాణకు శత్రువు. అసలు తల్లి ఎక్కడిది.. బిడ్డ ఎక్కడిది. తెలంగాణ ఏర్పాటుతో భారత మాత కన్నీళ్లు పెట్టిందట.. సన్నాసి మోడీ చూశాడట..’’ అని మండిపడ్డారు.
ప్రజల కోసమే ఎన్నికల బరిలో ఉన్నం..
‘‘తెలంగాణ రాష్ట్ర కల నెరవేరినప్పుడే వెయ్యి జన్మల తృప్తి కలిగింది. అప్పుడే తప్పుకొందామనుకున్న.. కానీ తెలంగాణ సమాజం నుంచి నాపై తీవ్ర ఒత్తిడొచ్చింది. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో కలపొద్దని నాపై దండయాత్ర సాగింది. తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం టీఆర్ఎస్ ఎన్నికల బరిలో ఉందిగానీ.. లేకపోతే పొన్నాల, చిటికన వేలంత సిన్మాయాక్టర్ పవన్ లాంటి సొల్లుగాళ్లతో మాటలు పడే కర్మ నాకేంది..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో టీఆర్ఎస్ 90 సీట్లలో విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నయి. అది వశంగాక ఒక్క బక్కోన్ని కొట్టేందుకు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మన్మోహన్సింగ్, చంద్రబాబు, మోడీ, పవన్.. గింతమంది నా వెంట పడ్డరు..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
సెక్యులర్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతం..
బలహీనవర్గాలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తన కోరిక అని.. తెలంగాణను దేశంలోనే సెక్యులర్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని కేసీఆర్ చెప్పారు. ‘‘60 ఏళ్ల పాటు ముస్లింలు కాంగ్రెస్‌కు అండగా ఉన్నా.. వారికి అన్యాయమే జరిగింది. ఇప్పుడు కేసీఆర్‌ను విశ్వసించండి. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేసి చూపెడతా..’’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు. మతతత్వ పార్టీ నేత నరేంద్ర మోడీని చంకలో పెట్టుకొని వస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని మైనార్టీలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రాన్ని సన్నాసుల చేతిలో పెట్టొద్దు..
తెలంగాణను సన్నాసుల చేతిలో పెడితే నష్టపోతామనే విషయాన్ని విస్మరించొద్దంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ప్రజల కు సూచించారు. ‘‘ఉద్యోగాల విషయంలో తెలంగాణకు న్యాయం గా రావాల్సిన వాటా గురించి మాట్లాడితే.. కేసీఆర్ పరుషంగా మాట్లాడుతడంటరు. అవును సచ్చేదాకా గట్లనే మాట్లాడుతా.. మన ఉద్యోగాలు మనకు కావాలని నేనంటే.. సెటిలర్లకు క్షమాపణ చెప్పాలని టీ కాంగ్రెస్ నేతలు అర్థం లేకుండా మాట్లాడుతున్నరు. వాళ్లకు బుద్ధి చెప్పాలె’’ అన్నారు.
ఇంకా లడాయి అయిపోలే..
తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఇంకా లడాయి అయిపోలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని, డ్వాక్రా మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. వృద్ధులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1,500 పింఛన్ అందజేస్తామన్నారు. ఆటోవాలాలకు లెసైన్స్‌ల జారీలో నిబంధనలను సడలిస్తామన్నారు.