భార్య ఆత్మహత్య రహస్యాన్ని చేధించిన భర్త
బెంగళూరు: ప్రేమించిన వాడికి పెళ్లి నిశ్చయమైందనే వార్తతో గత ఏడాది వివాహిత ఆత్మహత్య చేసుకున్న కేసుకు సంబంధించిన చిక్కుముడి వీడింది. తన భార్య ఆత్మహత్యకు గల కారణాలను స్వయంగా ఆమె భర్తే శోధించి పోలీసులకు అందించడం ఇక్కడ మరో విశేషం.
వివరాల్లోకి వెళితే...ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వెంకట్ జగదీశ్‌కు అదే ప్రాంతానికి చెందిన జోత్స్నా వైశ్యరాజుతో 2015 మార్చిలో వివాహమైంది. బెంగళూరులో సాప్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న వెంకట్ జగదీశ్ పెళ్లయిన అనంతరం భార్య జోత్స్నను తన వెంట తీసుకొని బెంగళూరులోని కాపురం పెట్టాడు. జోత్స్న కూడా ఇంజనీరింగ్ చదవగా తనకు ఉద్యోం చేయడం ఇష్టం లేకపోవడంతో ఇంట్లోనే ఉండేది. పెళ్లయిన కొద్ది నెలల వరకు వైవాహిక జీవితం సజావుగా సాగుతున్న వెంకట్‌కు అదే ఏడాది డిసెంబర్లో జోత్స్న ఆత్మహత్యకు పాల్పడడంతో ఊహించని షాక్ తగిలింది.
అప్పటి వరకు తనను సొంత కొడుకులా భావించిన జోత్స్న తల్లితండ్రులు కుమార్తె ఆత్మహత్యకు తమ అల్లుడైన వెంకట్ కారణమని, అతడి చిత్రహింసలు భరించలేకే తమ జ్యోత్స్న ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంకట్‌ను అరెస్ట్ చేసారు. అనంతరం ఈ ఏడాది జనవరిలో బెయిల్‌పై విడుదలైన వెంకట్ అప్పటి నుండి తన భార్య ఆత్మహత్యకు గల కారణాలపై పరిశోధించడం ప్రారంభించాడు.ఆమె కాలేజీ నాటి ఫోటోలు,పరిచయాలు, ఫేస్బుక్, వాట్సాప్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన వెంకట్‌కు తన భార్య జోత్స్నకు,ఆమె సీనియర్ గిరీశ్ పట్నాయక్‌లకు మధ్య ప్రేమ వ్యవహారం బయటపడింది.
ఆమె ఫేస్బుక్ అకౌంట్ తెరచి చూడగా అందులో 60వేల మెసేజ్లున్నాయని అందులో ఎక్కువగా గిరీశ్ పట్నాయక్‌తోనే ఛాటింగ్ చేసేదని,అందులో ఇద్దరం కలసి ఎక్కడికైనా పారిపోదామని మాట్లాకున్నట్లు వెంకట్‌కు తెలిసింది.అంతే కాకుండా తన ఆఫీస్‌కు వెళ్లిన అనంతరం ఆమె మొబైల్ నుండి ఎక్కువగా గిరీశ్ పట్నాయక్‌కే కాల్స్ వెళ్లినట్లుగా వెంకట్ తెలుసుకున్నాడు. కాలేజీ నుండి నడుస్తున్న జోత్స్న,గిరీశ్ పట్నాయక్ల ప్రేమ వ్యవహారం జోత్స్నకు వివాహమైన అనంతరం కూడా కొనసాగించినట్లు తెలుసుకున్నాడు.
ఈ క్రమంలో గిరీశ్పట్నాయక్కు మరో యువతితో వివాహం నిశ్చయమైందని తెలియడంతో దీనిపై జోత్స్న ప్రశ్నించగా అతడు ఆమెను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. దీంతో గిరీశ్పట్నాయక్ తీరుతో మనస్థాపం చెందిన జోత్స్న ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వ్యవహారాన్ని అంతా వెంకట్ సాక్ష్యాలతో సహా పోలీసులకు అందించారు. ఆ సాక్ష్యాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు జోత్స్న ఆత్మహత్యకు కారకుడైన గిరీశ్ పట్నాయక్‌ను శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి బెంగళూరు తరలించి విచారణ చేస్తున్నారు.