ముందు తమ్ముడి తో చిత్రం చెయ్యండి
ముందు తమ్ముడితో చిత్రం చెయ్యండి అని నటుడు సూర్య అంటున్నారు. సూర్య హీరోగా చిత్రం చేయాలనుకునే దర్శకులు ఆయనకు కథలు వినిపిస్తున్నారు. వారికి ముందు తమ్ముడు కార్తీతో చిత్రం చేయండి అంటూ సిఫార్సు చేస్తున్నారట. అలా సూర్యతో చిత్రం చేయాలని ఆశించిన దర్శకుల్లో వెంకట్‌ప్రభు ఒకరు. మంగాత్తా విజయం సాధించిన నేపథ్యంలో వెంకట్‌ప్రభు సూర్య కోసం కథ తయారు చేసి ఆయనకు వినిపించారట. కథ విన్న సూర్య మనం తర్వాత చిత్రం చేద్దాం. ఈ కథను కార్తీ హీరోగా తెరకెక్కించండని రెకమెండ్ చేశారట.
అలా వెంకట్ ప్రభు కార్తీతో చేసిన చిత్రమే బిరియాని. అదే విధంగా దర్శకుడు ఎం.రాజేష్ తన వద్ద మంచి హాస్యభరిత కథ ఉంది దాన్ని సూర్యతో చేయాలనుందనే కోరికను ఒక ఆడియో కార్యక్రమంలో సూర్య సమక్షంలోనే వెల్లడించారు. రాజేష్ కథ విన్న సూర్య షరా మామూలుగానే కార్తీకి సిఫార్సు చేశారట. ఆ చిత్రమే అళగురాజా. తాజాగా సూర్యతో సింగం-2 తీసి హిట్ కొట్టిన దర్శకుడు హరి మరోసారి ఆయన కోసమే కథ సిద్ధం చేశారట. ఈ కథను కూడా సూర్య కార్తీ హీరోగా రూపొందించమని హరికి చెప్పారట. దీంతో ఆయన కార్తీతో చెయ్యాలా? వద్దా? అన్న సందిగ్ధంలో పడ్డట్టు కోలీవుడ్ టాక్. దీంతో ఇప్పుడు సూర్యకు కథలు వినిపించడానికి కొందరు దర్శకులు సంశయిస్తున్నారట.