ఏసీబీ వలలో రెవెన్యూ ఇన్స్పెక్టర్
లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడు ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్. కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణ కౌన్సిలర్ వెంకట నాంచారయ్యకు స్థానికంగా పెట్రోల్ బంకు ఉంది. బంక్ స్థలం డాక్యుమెంట్లను తన కుమారుడి పేరిట రిజిస్టర్ చేయాలంటూ ఆయన గత పదిరోజులుగా రెవెన్యూఇన్స్పెక్టర్ చుట్టూ తిరుగుతున్నారు. ఆర్ఐ శ్రీనివాసరావు మాత్రం రూ.10 వేలు ఇవ్వందే పని కాదని తేల్చిచెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఉప్పందించాడు. వారి సూచనల మేరకు బుధవారం సాయంత్రం ఆర్ఐ కార్యాలయంలో డబ్బు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.