విలువైన వెంకటగిరి చరిత్ర
బ్రిటిష్ పాలన ముందు కాలంలోనూ బ్రిటిష్ పాలన తరవాతి కాలంలోనూ వెంకటగిరి జమీందారీ చరిత్ర సాహిత్యాలను విశదపరిచే పుస్తకం కాళిదాసు పురుషోత్తం రాసిన ‘వెంకటగిరి సంస్థాన చరిత్ర - సాహిత్యం’. ఆంధ్రదేశంలోని అతిపెద్ద జమీందారీలలోకి వెంకటగిరి వస్తుంది. ఈ జమీందారుల వంశం పేరు వెలుగోటి. కర్నూలు జిల్లాలోని వెలుగోడులో మొదలైన ఈ వంశంలో ముఖ్యుడు వెలుగోటి పెద్దరాయలు. ఇతను పదిహేనవ శతాబ్దపు చివరి భాగానికి గజపతులకు సామంతుడిగా ఉండేవాడు. తరువాతి కాలంలో వెలుగోటి వారు కర్నూలు నుండి వెంకటగిరికి వలసవచ్చి పాలకులుగా స్థిరపడ్డారు.
1750 నాటికి ఆర్కాటు నవాబు కిందకి వచ్చిన వెంకటగిరి సంస్థానం 1802లో నవాబుతో బ్రిటిష్‌వారికి జరిగిన శాశ్వత రెవెన్యూ ఒప్పందం ప్రకారం రాజ్యాధికారం బ్రిటిష్ హస్తగతమయ్యి దరిమిలా వెంకటగిరి సంస్థానం మద్రాసు ప్రెసిడెన్సీలో భాగం అయింది. దేశంలోని ఇతర జమిందారీలకు కూడా దాదాపు ఇదే గతి పట్టింది. దాంతో గతంలో సామంతరాజులుగా, పాలెగాళ్లుగా పరిపాలనాధికారాలు అనుభవించిన జమీందార్లు పందొమ్మిదవ శతాబ్దంలో ఆ అధికారాలు కోల్పోయి ధనం మాత్రం సంపాదించి సమాజంలో స్థాయి, విలువ, గుర్తింపుల కోసం ఆ ధనాన్ని గుళ్లు కట్టించడం మీదా, దానధర్మాలు చెయ్యడం మీదా, విలాస జీవితం మీదా, లలితకళా సాహిత్యాల ఆదరణ మీదా వెచ్చించడం మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ పరిస్థితితో ఏకీభవిస్తున్నట్లుగానే వెంకటగిరి జమీందారులు కూడా పందొమ్మిది, ఇరవయ్యో శతాబ్దాల్లో ప్రవర్తించారు. బంగారు యాచమనాయుడు (1789-1847) వెంకటగిరిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేశాడు. ఆయన కుమారుడు కుమార యాచమనాయుడు (1831-1892) సంస్కృతాంధ్రాలను, పార్శీ భాషను ఇతోధికంగా ప్రోత్సహించాడు. పై ఇద్దరు జమీందార్లు సాంప్రదాయక వాదులు. 1857 తిరుగుబాటు ప్రభావం దక్షిణ భారతదేశంలో దాదాపుగా లేదు. ఇక్కడి రాజులు, జమీందారులు ఆంగ్లేయ ప్రభుత్వానికి విధేయులుగా నిలిచారు. వెంకటగిరి జమీందార్ల వైఖరి కూడా ఇదే.
పంతొమ్మిదవ శతాబ్దపు రెండవభాగంలో జమీందార్ల ప్రాపంచిక దృక్పథంలో, జీవనశైలిలో మార్పులు రాసాగాయి. ఇంగ్లిష్ నేర్చుకోవడం, క్రమశిక్షణ, మితవ్యయం వంటివి ఈ మార్పులలో కొన్ని. తమ ఎస్టేట్లను సమర్థవంతంగా నడుపుకోవాలని, అప్పులు దుబారా ఖర్చులు చెయ్యరాదని ఆంగ్లేయ పాలకులు సంస్థానాధిపతులకి జమీందార్లకి బోధించారు. వితరణ దాతృత్వం వంటి మునుపటి రాజరికపు విలువలు క్షీణించి ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకునే వ్యాపారస్తుల సంస్కృతిది పై చేయి అయింది. బహుశా ఈ పరివర్తనకాలంలోనే కావచ్చు తను చేసిన గొప్ప ప్రదర్శనకు కానుకగా మైసూరు మహారాజు ఇచ్చిన చిన్న ప్రతిఫలాన్ని చూసి ఆదిభట్ల నారాయణదాసు తన స్వీయచరిత్రలో వాపోతాడు. ఈ కొత్త సంస్కృతిలో భాగస్తులే రాజగోపాలకృష్ణ యాచే్రంద (1857-1916), గోవింద కృష్ణయాచేంద్ర (1879-1937). ఆనాటి మధ్యతరగతి భారతీయ సమాజం మీద తీవ్రమైన ప్రభావం చూపుతున్న విక్టోరియన్ నైతిక విలువల ప్రభావం ఈ జమీందార్లపైన కూడా చూడవచ్చు. మద్యపానం కూడదని, స్త్రీ వ్యసనం తప్పనీ, బహుభార్యాత్వం గర్హనీయమనీ రాజగోపాలకృష్ణ భావించాడు.
గోవిందకృష్ణ యాచేంద్ర (1879-1937) హయాంలో వెంకటగిరి సంస్థానంలో రైతు సంబంధిత సమస్యలు ఉత్పన్నమయ్యాయి. జమీందారులకి విశాల దృష్టి ఉంటే తమ ఆదాయాలతో పాటు రైతుల స్థితిగతులు కూడా పట్టించుకునేవారు. అయితే అందరు జమీందార్లకి అటువంటి దృష్టి లేదు. పరిపాలనా దక్షత అంతగా లేని గోవిందకృష్ణకి వేట పిచ్చి, మద్రాసు బెంగుళూరుల్లో కులాసా జీవితం గడిపే అలవాటు ఉండటం వలన ఎస్టేటులోని ప్రజల పరిస్థితులు పట్టించుకోలేదు. జమీందారు అలసత్వానికి వ్యతిరేకంగా బయల్దేరిన రైతు ఉద్యమక్రమంలో ‘ఆంధ్రభాషా గ్రామ వర్తమాని’, ‘జమీన్ రైతు’ వంటి పత్రికలు రావడం, దంపూరు నరసయ్య, నెల్లూరు వెంకట్రామానాయుడు వంటి పాత్రికేయులు ప్రాముఖ్యత సంతరించుకోవడం, నెల్లూరు జిల్లా జర్నలిజం చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలు. ఇవన్నీ ఈ పుస్తకం విపులంగా వివరిస్తుంది.
పురుషోత్తం గ్రంథంలో మరో ముఖ్యమైన భాగం జమీందారీలో నివసించిన లేదా జమీందారీకి విచ్చేసిన కవుల గురించి, వారి కావ్యాల గురించి. ఈ విషయాలు నా నైపుణ్యపు పరిధికి బయటవి. కావ్యాల ఇతివృత్తాలు పురాణేతిహాసాలకు సంబంధించినవైనా ఏ యుగకాలాలలో అవి రాయబడతాయో ఆ యుగపు ప్రత్యేకతలను అవి ప్రతిబింబిస్తాయని భావించవచ్చు. అటువంటి ప్రత్యేకతలు సాహిత్యపరంగానూ, సామాజిక పరంగానూ ఉంటాయి. ఇవే కాకుండా జమీందారు ఆధిపత్యాన్ని భూఆక్రమణను నిరసిస్తూ విక్కిరాల రంగాచార్యుల వంటి అగ్రహారీకులు రాసిన శార్దూల శతకం, అభాసరసిక జన తారావళి వంటి కావ్యాలను ఆశ్లీల కావ్యాలుగా కొట్టి పారేయకుండా అటువంటి కావ్యాలను, రచయితలను ప్రభావితం చేసిన సామాజిక నేపథ్యం మీద దృష్టి పెడితే ఆ సమాజం గురించి కొత్తకోణాలు అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. ‘‘వెంకటగిరి సంస్థాన చరిత్ర-సాహిత్యం’’ వెంకటగిరి సంస్థాన చరిత్రకు సాహిత్యానికి సంబంధించిన సర్వస్వం. విపులమైన చరిత్ర పరిశోధనకు ఎన్నుకోదగ్గ అంశాలు ఇందులో ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. రచయిత కాళిదాసు పురుషోత్తం అభినందనీయుడు.
- వి.రాజగోపాల్, హెచ్‌సీయూ