ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా
ఆలూరు రూరల్, న్యూస్‌లైన్: వచ్చే ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని స్వర్గీయ కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు కుమార్తె బొజ్జమ్మ తెలిపారు. మంగళవారం ఆమె ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ గతంలో తన తండ్రి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. చివరికి ప్రాణాలను కూడా కోల్పోయారన్నారు. పదవులను ఆశించకుండా కేఈ బ్రదర్స్ రాజకీయ ఎదుగుదలకు అహర్నిశలు శ్రమించాడన్నారు. వారి విజయాల కోసం దేవనకొండ మండలంలో ప్రత్యర్థులతో పోరాడారన్నారు.
తమ తండ్రి మరణానంతరం తాను రాజకీయాల్లో రాణించాలని ఉన్నా కేఈ బ్రదర్స్ అడుగడుగునా అడ్డుకట్ట వేస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలూరు టీడీపీ టికెట్ తనకు ఇప్పించాలని వారిని కోరినా పట్టించుకోలేదని విమర్శించారు. చివరికి చంద్రబాబునాయుడిని సోమవారం హైదరాబాద్‌లో కలిసి తనకు టికెట్ కేటాయించాలని కోరినా ఫలితం లేకపోయిందన్నారు. చంద్రబాబునాయుడు బీసీలను మోసం చేస్తున్నాడని ఆమె వాపోయారు. పార్టీని నమ్ముకున్న తన కుటుంబానికి, తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. ప్రజలు తనను ఆదరిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు.