చారకొండ గుండెదడ
వంగూరు, న్యూస్‌లైన్: ఆ ఊరికి దారులన్నీ బంద్ అయ్యాయి. గతకొన్ని రో జులుగా చుట్టాలు, బంధువులు రావడమే మానేశారు. పుట్టిపెరిగిన ఊరి నీళ్లను తాగడం కాదు.. చూస్తేనే ఆ గ్రామస్తులు హడలిపోతున్నారు. కొందరైతే బంధువుల వద్దకు బాటకడుతున్నారు. కారణమేమంటే అతిసార భయమే..! మండలంలోని చారకొండ వాసులు భయం గుప్పట్లో గడుపుతున్నారు. పదిరోజులుగా గ్రామాన్ని అతలాకుతలం చేస్తున్న అతిసారవ్యాధి మరోసారి తన ప్రతాపం చూపింది. దెబ్బకు చిన్నాపెద్దా అనే తేడాలేకుండా మంచం పడుతున్నారు. శుక్రవారం చారకొండ, సిరసనగండ్ల, మర్రిపల్లి గ్రామాలకు చెందిన దాదాపు మరో 15మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో చిన్నారులే అధికంగా ఉన్నారు.
గ్రామంలోనే వైద్యశిబిరం ఏర్పాటుచేసి చికిత్సలు అందజేస్తున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. బాధితులను కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తున్నారు. అక్కడ కొద్దిసేపు ఉంచి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం చారకొండ గ్రామానికి చెందిన సాయిప్రసన్న, శివలీల, మహేష్, నరేష్, ప్రవీణ్, సాయిచందర్, రవి, సిరసనగండ్లకు చెందిన బుచ్చమ్మ, యాదమ్మ, ముత్తయ్య, మర్రిపల్లికి చెందిన ద్రౌపతమ్మ, రాములు, ప్రశాంత్‌లతోపాటు మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. వీరికి ప్రధానంగా విరేచనాలు అధికమవడంతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా గ్రామంలో పారిశుధ్య పనులు చేయడంతోపాటు వైద్య శిబిరం ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు వైద్యం అందిస్తున్నారు. మరోవైపు ఇంటింటికెళ్లి తాగునీరు, తీసుకునే ఆహారపదార్థాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నప్పటికీ వ్యాధి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటి కలుషితమే కారణం
ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్‌దాస్ మాట్లాడుతూ.. వ్యాధితీవ్రత అధికమవడంతో తాము చేసేదేమీ లేదని పదిరోజులుగా తీవ్రంగా శ్రమించి వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. గ్రామంలో తాగునీరు కలుషితమవుతుందని, అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే చారకొండతో పాటు సమీపంలో ఉన్న తుర్కలపల్లి, మర్రిపల్లి, మర్రిపల్లి తండా, శాంతిగూడెం, అగ్రహారం తండా, సిరసనగండ్ల గ్రామాల్లోనే వ్యాధితీవ్రత కనిపిస్తోంది.
చర్యలు మరిచిన అధికారులు
చారకొండ గ్రామాన్ని అతలాకుతలం చేస్తున్న అతిసారవ్యాధిని అరికట్టేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు మొక్కుబడిగా ఉన్నాయని గ్రామస్తులు పెదవివిరుస్తున్నారు. గ్రామంలో తాగునీరు సరఫరా అయ్యే పైప్‌లైన్ లీకేజీ అయి మురుగునీరు చేరినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. గత 20 రోజుల క్రితం తాగునీటికోసం నూతనంగా పైప్‌లైన్ వేసేందుకు జేసీబీతో గుంతలు తీసిన సమయంలో పైప్‌లైన్ పగిలింది. అక్కడ మురుగునీరు చేరి..తాగునీటి పైపులైన్లో కలుస్తోంది. తిరిగి ఆ నీరే గ్రామంలో సరఫరా అవుతోంది. గ్రామంలో ఎక్కడచూసినా అపరిశుభత్ర రాజ్యమేలుతోంది. గ్రామంలో ఏడేళ్లుగా మురికికాల్వలను శుభ్రం చేయడం లేదని స్థానికులు వాపోతుతున్నారు. అయితే గ్రామానికి నీటి సరఫరా చేసే పైప్‌లైన్ మరమ్మతులు మరిచిన అధికారులు గ్రామంలో అతిసార రావడానికి ఒక వాటర్ప్లాంటే కారణమని చెప్పి చేతులు దులుపుకోవడం సమంజసం కాదని మండిపడుతున్నారు.
పైప్‌లైన్ లీకేజీ విషయాన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో శుక్రవారం స్థానిక పీహెచ్సీ వైద్యులు డాక్టర్ వెంకట్‌దాస్ నేరుగా అక్కడికి వెళ్లి ఫొటోలు తీసుకుని నేరుగా డీఎంహెచ్ఓకు పంపించారు. ఇదిలాఉండగా, వారం రోజులుగా వాటర్ ట్యాంకుల నుంచి నీటి సరఫరానే నిలిపివేశామని, కేవలం వాటర్ ట్యాంకర్ల ద్వారానే తాగునీటిని సరఫరా చేస్తున్నామని అలాంటప్పుడు ఆ నీరు ఎలా కలుషితమవుతుందని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అతిసార ప్రబలిన నాటినుంచి గ్రామస్తులు ఫిల్టర్చేసిన నీటినే తాగుతున్నారు. అయినప్పటికీ అతిసార ఎందుకు ప్రబలుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. గ్రామాన్ని ఉన్నతాధికారులు సందర్శించి మెరుగైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.