ఇంట్లో గ్యాస్ పేలుడు
హిందూపురం అర్బన్ : హిందూపురం పట్టణంలోని నానెప్పనగర్‌లో నివాసముంటున్న మారుతి కాండిమెట్స్ యజమాని వెంకటేష్ ఇంట్లో సోమవారం గ్యాస్ పేలుడు సంభవించింది. తల్లి అంత్యక్రియల కోసం వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి మూడు రోజుల కిందట ఇంటికి తాళం వేసి బెంగళూరుకు వెళ్లారు. ఇంట్లో గ్యాస లీకవుతూ గదంతా వ్యాపించింది. సోమవారం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరగడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి సిలిండర్ వేడెక్కి పేలిపోయింది.
భారీ శబ్దం వచ్చి మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఫ్రిజ్, కంప్యూటర్, టీవీ, ఇతర వస్తువులు, నిత్యావసర సరుకులు కాలిపోయాయి. గోడలు ధ్వంసమయ్యాయి. దాదాపు రూ.6లక్షల దాకా నష్టం వాటిల్లి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు. బాధితుడికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు.