జనవరి 16 నుంచి ‘కడెం’ నీటి విడుదల
కడెం, న్యూస్‌లైన్ : కడెం ప్రాజెక్టు ఆయకట్టు కిందనున్న వేలాది ఎకరాల పంట పొలాలకు వచ్చే నెల 16వ తేదీ నుంచి రబీ నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల క్రితం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో వారు ఈ నిర్ణయం తీస్కున్నారని ఈఈ వివరించారు. కాగా, తొలుత కడెంలో జరిగిన నీటి సంఘాల సమావేశంలో జనవరి 8వ తేదీ నుంచే నీటి విడుదలకు నిర్ణయించారు.
కానీ ఈ తేదీని అధికారులు తాజా సమావేశంలో మార్చారు. అయితే జనవరి 16వ తేదీ నుంచి ఎడమ, కుడి కాలువల ద్వారా నీటి విడుదల పద్ధతి ఈ విధంగా ఉంటుందని ఆయన వివరించారు.
జనవరి 16 నుంచి 25వ తేదీ వరకు
ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు
ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 వరకు
మార్చి 17 నుంచి 26 వరకు
ఏప్రిల్ 6 నుంచి 15వ తేదీ వరకు..
మిగతా రోజుల్లో కాలువలు మూసి ఉంటాయ ని ఈఈ తెలిపారు. ఈ పద్ధతిన డి-01 నుంచి డి-40 వరకు నీరిస్తామని, డి-42 పరిధిలో చెరువులను నింపుతామని పేర్కొన్నారు. ఆయకట్టు రైతులు ఈ విషయాన్ని గమనించి ఉన్న నీటిని పొదుపుగా వాడుకొని పంటల సాగు చేసుకోవాలని ఆయన సూచించారు.