చియ్యేడుకు పశువైద్యుడి నియామకం
సాక్షి ఎఫెక్ట్....!!
అనంతపురం అగ్రికల్చర్: పశు వైద్యుడు లేక చియ్యేడులోని రైతులు పడుతున్న ఇబ్బందులపై గతనెల 26న ‘మాటరాని మౌనం’ పేరుతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై పశుసంవర్ధకశాఖ అధికారులు స్పందించారు. అనంతపురం రూరల్ మండలం చియ్యేడు పశువుల ఆస్పత్రిలో రెగ్యులర్ డాక్టర్ లేకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆరా తీసిన జేడీ డాక్టర్ బి.సన్యాసిరావు అక్కడ పశువైద్యాధికారి నియామకానికి వేగంగా చర్యలు తీసుకున్నారు. డైరెక్టరేట్లో పనిచేస్తున్న డాక్టర్ రమను చియ్యేడు ఆస్పత్రి డాక్టరుగా నియమించినట్లు జేడీ సన్యాసిరావు బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. అలాగే మరికొన్ని ఆస్పత్రులకు వైద్యులను నియమించడానికి, పశుభవనాల నిర్మాణం, ఇతరత్రా మౌలిక వసతులు, మందుల సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.