అసెంబ్లీ నిబంధనల్ని ఉల్లంఘించడం దారుణం
తణుకు : రాష్ట్ర శాసనసభ కార్యకలాపాలకు సంబంధించిన వీడియో టేపులు ఒక పక్షానికి సంబంధించినవి మాత్రమే బహిర్గతం చేయడం దురదృష్టకరమైన పరిణామంగా స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల రాష్ట్ర శాసనసభలో వైఎస్సార్ సీపీకి చెందిన వీడియో టేపులు మాత్రమే బయటపెట్టారని, ఇది శాసనసభ నియమనిబంధనల ఉల్లంఘనేనని చెప్పారు.
శాసనసభలో మొత్తం కార్యకలాపాలు యధాతథంగా ప్రజల ముందుంచాలన్నారు. ప్రతిపక్షానికి సంబంధించినవి మాత్రమే కాకుండా అధికార పక్ష సభ్యులు మాట్లాడిన అంశాలు అన్నింటినీ యథాతధంగా ప్రజల ముందుంచాలని, అప్పుడు ప్రజలే వాస్తవాలు తెలుసుకుంటారన్నారు. వీడియోటేపులు బహిర్గతంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనకు తెలియకుండా బహిర్గతం జరిగిందనడాన్ని వంక తప్పుపట్టారు. తెలియదనడంతో స్పీకర్ తన బాధ్యత నుంచి తప్పించుకోవడం సరికాదన్నారు.
చట్టసభల నిర్వహణలో, సభా హుందాతనాన్ని కాపాడటంలో స్పీకర్ బాధ్యత విస్మరించరానిదని వంక పేర్కొన్నారు. కాళేశ్వరరావు, సుబ్బారెడ్డిలాంటి ఎందరో రాష్ట్ర శాసనసభ స్పీకర్లుగా పనిచేసి నిష్పక్షపాతంగా వ్యవహరించి సభ హుందాతనాన్ని, గౌరవాన్ని పెంచారని గుర్తు చేశారు. తాను 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై 15 ఏళ్లపాటు పని చేశానని ఇప్పుడు సభలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, సభ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఎప్పుడూ చూడలేదన్నారు.