చిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటమా
- విజయవాడ చంద్రబాబు జాగీరు కాదు
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విజయవాడ (లబ్బీపేట)
చంద్రబాబు ప్రభుత్వం చిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని, నెల్లూరులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మిత్రతో పాటు మిగిలినవారికి ఏం జరిగినా చంద్రబాబు, మంత్రి కామినేనిలు బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వైద్య మిత్రలు అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రిలో చేరారని వార్తలు రావడంతో ఆయన అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన వైద్య మిత్ర తనకు గుండె జబ్బు ఉందని, అయినా పట్టించుకోకుండా పోలీసులు క్రూరంగా వ్యవహరిస్తూ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారని ఆయన ముందు కన్నీరు మున్నీరయ్యారు. తమకు ఉద్యోగాలు తీసేయడమే కాకుండా, టైస్టులపై వ్యవహరించే రీతిలో తమతో పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై రామకృష్ణ స్పందిస్తూ.. విజయవాడ చంద్రబాబు జాగీరు కాదని, నగరంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నంత మాత్రాన పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు కూడా జరుపుకోనివ్వరా అని ప్రశ్నించారు. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వైద్య మిత్రాలను స్టేషన్లకు తరలించారని, వారికి ఆహారం, నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనికి చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని రామకృష్ణ హెచ్చరించారు.