లావు రత్తయ్య చేరికతో వైఎస్సార్ సీపీ బలోపేతం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరిక జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూర్చింది.
విద్యావంతుడు, వినయశీలి అయిన రత్తయ్య పార్టీలో చేరడంపై విద్యారంగానికి చెందిన ప్రముఖులు, వివిధ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో రత్తయ్య ముఖ్య భూమిక వహించారు. విద్యాసంస్థలన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి రాష్ర్ట విభజనకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించారు.
గుంటూరు హిందూ కళాశాల కూడలిలో విజ్ఞాన్ విద్యాసంస్థల విద్యార్థులు రత్తయ్య నేతృత్వంలో దీక్షలు చేశారు. పెదనందిపాడు గ్రామానికి చెందిన రత్తయ్య తన 27 ఏటే విద్యాసంస్థ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. అకుంఠిత దీక్ష, దక్షతతో విద్యాసంస్థను విశ్వవిద్యాలయంగా విస్తరింప చేశారు. ప్రస్తుతం ఇంజినీరింగ్, ఫార్మశీ వంటి అనేక కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
కొంతకాలంగా రత్తయ్య టీడీపీలో చేరతారనే ఊహగానాలు వినపడ్డాయి. అనూహ్యంగా శుక్రవారం పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో రాజధానిలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు.