వందశాతం వినోదంతో...
నటుడిగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన చిన్నా 2009లో మెగా ఫోన్ చేతబట్టి ‘ఆ ఇంట్లో’ అనే హారర్ సినిమా డెరైక్ట్ చేశారు. మళ్లీ ఇన్నేళ్ల విరామం తర్వాత ఆయనో సినిమా డెరైక్ట్ చేస్తున్నారు. విహారిక సమర్పణలో వికాస్ ప్రొడక్షన్ పతాకంపై ఆడార్ రవికుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి చిన్నా మాట్లాడుతూ -‘‘ ఇందులో వంద శాతం వినోదం ఉంటుంది. అందరినీ అలరించడంతో పాటు నవ్విస్తుంది.
సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే. ఇప్పటి పరిస్థితుల్లో బాధలు, ఏడుపులు, రక్తపాతాలు ఉన్న సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడరని నా అభిప్రాయం. ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభించి, ఒకే షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తిచేస్తాం’’ అన్నారు. నిర్మాత ఆడార్ రవికుమార్ మాట్లాడుతూ ‘‘నిర్మాత బాగుంటే మనం బాగుంటాం అనే మనస్తత్వం దర్శకుడు చిన్నాది. ఆయన ‘ఆ ఇంట్లో’ చిత్రం డెరైక్ట్ చేస్తున్నప్పుడు చూశా. ఆ ప్రతిభ నచ్చి ఈ సినిమా నిర్మిస్తున్నా. ఫిబ్రవరి 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ చేసి, మే ఆఖరులో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత బొత్స నాయుడు.